సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?: టీడీపీ నేత హత్యపై నారా లోకేశ్

by Seetharam |
సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?: టీడీపీ నేత హత్యపై నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అధికార అండదండలతో వైసీపీ చేస్తున్న నెత్తుడి దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని లోకేశ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తుంటే... కింది స్థాయిలో అయితే మరీ అరాచకంగా ప్రాణాలు తీస్తున్నారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత రామారావు హత్యపై నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ నేత పత్తి రామారావును వైసీపీ నేతలే హతమార్చారని నారా లోకేశ్ ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీపీ రౌడీ మూకలు దారుణంగా హత్య చేసారన్నారు. వివాదరహితుడు, టీడీపీ కోసం పనిచేసే రామారావును హత్యచేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. పల్నాడు జిల్లాను సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? అని లోకేశ్ నిలదీశారు. వైసీపీకి రోజులు దగ్గరపడే టీడీపీ కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పత్తి రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేసారు. వైసీపీ రౌడీ మూకల చేతిలో దారుణంగా హత్యకు గురైన పత్తి రామారావు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసానిచ్చారు.

అసలేం జరిగిందంటే!

ఇకపోతే కొత్త అంబాపురం గ్రామానికి చెందిన పత్తి రామారావు(73) టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రామారావుకు భార్య ఇద్దరు కుమారులు సంతానం. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రామారావు భార్య సైతం చిన్న కుమారుడి వద్ద ఉంటుంది. దీంతో కొత్త అంబాపురంలో పత్తి రామారావు ఒక్కడే ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా ఉంటున్నాడు రామారావు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసం హతమార్చారు. స్థానికుల ద్వారా రామారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పత్తి రామారావును హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆస్తి తగాదాలు కూడా హత్యకు దారితీయోచ్చు అని ప్రచారం కూడా ఉంది. అయితే రామారావు హత్యకు గల కారణాలపై పోలీసులు ఏం తేల్చనున్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story