మళ్ళీ జగనే సీఎం... పవన్ కల్యాణ్‌‌పై హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

by Seetharam |
మళ్ళీ జగనే సీఎం... పవన్ కల్యాణ్‌‌పై హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఈ నవరత్నాల వల్ల ఎంతో మంది నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై అద్భుతమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పట్ల ప్రజల ఆదరణ ఉందని వచ్చే వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇది తానొక్కడినే చెప్పడం లేదని అనేక సర్వేలు సైతం అవే స్పష్టం చేస్తున్నాయి అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

మహానుభావులే ఓడిపోయారు

ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్ అని కొనియాడారు. పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా ఆడకపోయినా ఆ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకు మెుత్తం కలెక్షన్లు వచ్చేస్తాయని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు రాజకీయాల విషయంలో చాలా స్మార్ట్‌గా ఉంటారని అన్నారు. నచ్చిన వాళ్ల సినిమా వస్తే చూస్తారని... కానీ ఓటేయాలని అనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారంటూ చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన మహానుభావులు సైతం ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నాయకులు గెలుచుకోవాలని చెప్పుకొచ్చారు. మరికొన్ని నెలల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయని...ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందని అప్పటి వరకూ వేచి చూద్దామని మంచు విష్ణు అన్నారు.

నేను పోటీ చేయను

మంచు విష్ణు తన రాజకీయ ఆరంగేట్రంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ప్రచారం జరుగుతుందని అదంతా అవాస్తవం అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇకపోతే మంచు విష్ణు వైఎస్ జగన్‌కు స్వయానా బావమరిది అవుతారు. వైఎస్ జగన్ చిన్నాన్న అల్లుడే మంచు విష్ణు. గత ఎన్నికల్లో మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు ఇద్దరూ వైసీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అటు మోహన్ బాబు ఇటు మంచు విష్ణు ఎన్నికల కాంపైన్ నిర్వహించిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు రాజకీయాలకు దూరమైపోయారు. రాజకీయాలంటేనే దండంపెట్టేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోనే తనకు సత్సంబంధాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు మంచు విష్ణుసోదరుడు మంచు మనోజ్‌ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవలే తన భార్య మౌనికరెడ్డితో కలిసి చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ అయ్యారు. పైకి తన కుమారుడి జన్మదిన వేడుకలకు ఆహ్వానించామని చెప్పుకొస్తున్నా రాజకీయ ఆరంగేట్రంపైనే చర్చించారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed