మాజీ సీఎం జగన్‌ను మరింత ఇరకాటంలోకి నెడుతోన్న సొంత పార్టీ నేతలు..!

by Satheesh |
మాజీ సీఎం జగన్‌ను మరింత ఇరకాటంలోకి నెడుతోన్న సొంత పార్టీ నేతలు..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వెనకటికి ఎవడో నేను లేస్తే మనిషిని కాదు అన్నాడట. అచ్చం అలాగే వుంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పి.విజయసాయి రెడ్డి ప్రకటన. బిల్లులు కావాలంటే రాజ్యసభలో మీకు మేం అవసరమన్న విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలంటూ ఆయన హెచ్చరించారు. తాము ఆంధ్రాలో అధికారం కోల్పోయినా తమకు ఇంకా లోక్‌సభ, రాజ్యసభల్లో 15 మంది ఎంపీలున్నారని, తెలుగుదేశంకి తమకంటే ఒక్క ఎంపీనే ఎక్కువని ఆయన లెక్కలు చెప్పి మరీ హెచ్చరిక జారీ చేశారు. ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి అయినా రాజ్యసభలో తమపైనే బీజేపీ ఆధారపడాల్సి వుంటుందని సెలవిచ్చారు.

ఎంపీలను కాపాడడానికా..? పంపడానికా..?

విజయసాయిరెడ్డి ప్రకటన చూసి సాటి వైసీపీ నేతలే ఆశ్చర్యపోయారు. ఆయన నిజంగానే బెదిరించారా..? లేక తమ ఎంపీల లెక్క చెప్పి వీరిని తీసుకోండని బేరం పెడుతున్నారా..? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేనప్పుడు కేంద్రంతో అయినా కాస్తో కూస్తో సయోధ్యగా వుండాల్సింది పోయి హెచ్చరికలు జారీ చేయడమేమిటని వైపీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవని, ఇటీవల నెల్లూరు ఎంపీ సీటులో దారుణంగా ఓడిపోయిన విజయసాయికి రాజకీయ నాయకుడి కంటే లాబీయిస్టు అనే పేరే వుంది. తెరచాటు రాజకీయాలకు పెట్టింది పేరైన ఆయన కేంద్రంలో బలంగా వున్న బీజేపీని బెదిరించడమంటే వై‌ఎస్ జగన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈడీ, సీబీఐ కేసులు పెట్టుకొని బెదిరింపులా..?

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మోడీ పాలనలో కాదు సీబీఐ, ఈడీ పాలనలో వుందంటూ జగన్‌కు అత్యంత ఆప్తుడైన బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే ఆరోపించారు. అదే నిజమనుకొంటే వైసీపీ అధినేత జగన్‌తో పాటు బెదిరింపులకు దిగిన విజయసాయిపై ఈడీ, సీబీఐ కేసులు విచారణలోఉన్నాయి. మరో ఎంపీ అవినాష్‌ రెడ్డి అదే బీజేపీ దయతో సీబీఐ అరెస్టు నుంచి గతంలో తప్పించుకొన్నారు.

మరో ఎంపీ మిధున్ రెడ్డిపై ఈడీలో ఫిర్యాదులున్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా, కనీస స్పృహ లేకుండా విజయసాయి కేంద్రంలోని బీజేపీకి హెచ్చరికలు జారీ చేసి ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు, అభిమానులు మదనపడుతున్నారు. ఇటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చే జగన్ 11 స్థానాలకు పరిమితమయ్యారని, వీరిని ఇలాగే ప్రోత్సహిస్తే పార్టీకి మరిన్ని ఇబ్బందులు, నేతల అరెస్టులు తప్పకపోవచ్చని కలవర పడుతున్నారు.

ఓటమి తరువాత తగ్గని అహంకారం

వైసీపీ ఓటమికి జగన్‌తో పాటు విజయసాయి వంటి నేతల అహంకారం ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనం అవినీతిని అయినా భరించగలరు కానీ అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించరని తెలంగాణ, ఆంధ్రా అసెంబ్లీ ఫలితాలే నిరూపించాయని పలువురు విశ్లేషకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి అహంకారంతో కేంద్రంపై ఉడుత బెదిరింపులకు దిగడమేమిటో ఆయనకే అర్థం కావాలి.

Advertisement

Next Story

Most Viewed