అధికార పక్షంలో అంతులేని కలవరం.. ముందస్తుకే మొగ్గు!

by samatah |   ( Updated:2023-04-19 03:24:49.0  )
Ys Jagan
X

సీఎం జగన్​ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా! మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీని రద్దు చేస్తారా ? ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే విశ్లేషకులు అంటున్నారు. కోడి కత్తి, వివేకా హత్య కేసుల్లో వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా తీర్పులు వస్తే పార్టీకి కోలుకోలేని దెబ్బని భావిస్తున్నారు. జూన్​లో తొలి విడత అభ్యర్థులను ఖరారు చేసి తెలంగాణతోపాటు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా కేసులు న్యాయస్థానాల్లో కొనసాగితే ఏదో విధంగా ఎన్నికలను గట్టెక్కవచ్చని ఊహిస్తున్నారు. ఈపాటికే కేసుల్లో ఎదురవుతున్న ఆరోపణలను ఎదుర్కోలేక వైసీపీ క్యాడర్ ​ఆత్మరక్షణలో పడింది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఏమాత్రం కొట్టిపారేయలేమని ఆ పార్టీ రెబల్​ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : ప్రస్తుతం సుమారు ఏడు లక్షల మంది వైసీపీ సైనికులు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్లి స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో తలమునకలయ్యారు. తద్వారా ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విపక్షాలు తిప్పికొడుతున్నా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఈ సమయంలో కోడి కత్తి, వివేకా హత్య కేసులు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్​ఐఏ తేల్చిచెప్పడం వైసీపీని, ముఖ్యంగా సీఎం జగన్ ను ఇరుకున పెట్టింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ​అరెస్టు అవుతారనే ప్రచారం క్యాడర్​ను మరింత బెంబేలెత్తించింది. 25వ తేదీ దాకా ఆయన్ని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్​మంజూరు చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసు దర్యాప్తును నెలాఖరులోగా ఓ కొలిక్కి తీసుకురావాలని సుప్రీం కోర్టు గతంలోనే అల్టిమేటం జారీ చేసింది. దీంతో సీబీఐ మరింత దూకుడు పెంచింది. న్యాయస్థానంలో విచారణ జరిగి తీర్పు వెలువడే సరికి కనీసం ఆరునెలలు పట్టొచ్చు. ఈలోగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రెండు నెలల్లో తొలి జాబితా?

ఈపాటికే 80 నుంచి 90 మంది అభ్యర్థులపై సీఎం జగన్ ​ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే మొదటి విడత అభ్యర్థులను జూన్​లో ఖరారు చేయొచ్చని ఇటీవల పార్టీ సమావేశంలో సీఎం జగన్ చూచాయగా వెల్లడించారు. ఎవరెవరికి సీట్లు నిరాకరిస్తారనే సమాచారం సీఎం వద్ద ఉంది. ఎవరెవరికి టికెట్ రాదో సిట్టింగు ఎమ్మెల్యేలు కూడా ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. అందువల్ల మిగతా స్థానాల్లో కూడా వెంటనే కసరత్తు మొదలు పెట్టే అవకాశాలున్నాయి. జూన్​దాకా స్టిక్కర్ల ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో పార్టీ క్యాడర్​ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. ఇంతకన్నా సానుకూల పరిస్థితులు మున్ముందు ఉంటాయా, ఉండవా అనే సందేహం వైసీపీ పెద్దలను పట్టిపీడిస్తోంది.

పట్టభద్రులు అందుకే షాకిచ్చారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఇచ్చిన షాక్ నుంచి జగన్ పార్టీ నేతలు ఇంకా కోలుకోలేదు. పోల్ ​మేనేజ్​మెంటులో పార్టీ వైఫల్యం ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దగా స్పందించలేదనే నిర్ధారణకు వచ్చారు. అందువల్లే ఓటమి పాలైనట్లు భావించారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం నిరుద్యోగుల్లో 35.1 శాతం పట్టభద్రులున్నట్లు సెంటర్ ​ఫర్​మానిటరింగ్ ​ఇండియన్ ​ఎకానమీ (సీఎంఐఈ) సర్వే వెల్లడించింది. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి లేనందునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినట్లు అవగతమవుతోంది. గడిచిన నాలుగేళ్లలో యువత స్వయం ఉపాధిని వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. అరకొరగా ఉన్న పథకాలను సైతం రద్దు చేసింది. దీంతో డిగ్రీ కన్నా తక్కువ విద్యార్హతలున్న వాళ్లలోనూ ఉపాధిలేమి వెంటాడుతోంది. యువతలో వ్యతిరేకత మరింతగా పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు విశ్లేషకుల అంచనా.

Advertisement

Next Story

Most Viewed