మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.. నివాళులర్పించిన జగన్, చంద్రబాబు,లోకేశ్, పవన్

by Prasanna |
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.. నివాళులర్పించిన జగన్, చంద్రబాబు,లోకేశ్, పవన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని పార్టీల అధినేతలు పాల్గొని పూలేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను నేతలు కొనియాడారు. ఇకపోతే మంగళవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జోగి రమేష్, విడదల రజని, గుడివాడ అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రసంసించారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని చెప్పుకొచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే మార్గంలోనే తాము పయనిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

పూలే స్ఫూర్తితో టీడీపీ ముందుకు : చంద్రబాబు

సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి తన నివాసంలో పూలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావ్ పూలేను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.

విద్యనే ఆయుధంగా మలుచుకున్న గొప్ప యోధుడు : లోకేశ్

ఇకపోతే యువగళం పాదయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద మంగళవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడిపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇతర టీడీపీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌ అని నారా లోకేశ్ సూచించారు.

చైతన్యమూర్తి పూలే :పవన్ కళ్యాణ్

అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు పూలే అని జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి అటువంటి ప్రజాస్వామ్యం కోసం కలలుగన్న గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఆ మహానుభావుడి సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు అర్పిస్తున్నట్లు తెలిపారు. శతాబ్దం కాలం నాడు ఆచార వ్యవహారాలు, కుల వ్యవస్థతో కూడిన ఛాందస భావాలు తీవ్రంగా ఉండేవని, అటువంటి పరిస్థితులలో కాలానికి, సమాజానికి ఎదురెళ్లి సమాజంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం పాటుపడిన ధీశాలి పూలే అని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త అని, వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడు అని కొనియాడారు. పూలు అమ్మే చిరు వ్యాపారిగా జీవితం ప్రారంభించి రచయితగా, తొలితరం స్వతంత్ర యోధునిగా, కార్మిక ఉద్యమ నేతగా, రైతు బాంధవునిగా ఆయన ప్రజాజీవితం అజరామరం అని పవన్ కల్యాణ్ కొనియాడారు. నేటి రాజకీయ పక్షాలు సైతం ఆయన చూపిన సామాజిక న్యాయం, సామాజిక ప్రభుత్వం అనే మార్గంలో పయనించడం ఆయన దార్శనికతకు, ముందు చూపునకు తార్కాణమన్నారు. జనసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన 'కులాలను కలిపే ఆలోచనా విధానం' జ్యోతిరావు పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం అని, ఆ మహనీయుని అడుగుజాడలలో జనసేన ప్రస్థానం కొనసాగుతుందని ఈ సందర్బంగా ఉద్ఘాటిస్తూ నా పక్షాన, జనసేన శ్రేణులు పక్షాన ఆ చైతన్యమూర్తికి అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.





Advertisement

Next Story