చంద్రగ్రహణం.. తేరుకోక పోతే పుట్టి మునిగినట్లే!

by Seetharam |   ( Updated:2023-06-13 10:05:40.0  )
చంద్రగ్రహణం.. తేరుకోక పోతే పుట్టి మునిగినట్లే!
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ‘చంద్రగ్రహణానికి’ రంగం సిద్ధమైంది. ఓ వైపు వైసీపీ, మరో వైపు బీజేపీ కలిసి రాహుకేతువుల్లా టీడీపీ అధినేతను కమ్మేస్తున్నాయి. చంద్రబాబు వెంటనే తేరుకోకపోతే ఆయనతో పాటు జనసేనాని భవిష్యత్తుకూ గండిపడినట్లే. కేంద్ర మంత్రి అమిత్ షా రెండు రోజుల కిందట విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీ, బీజేపీ వ్యూహం బట్టబయలైంది.

‘తిట్టినట్లు నేను నటిస్తాను, ఏడ్చినట్లు నువ్వు నటించు..’ అన్న నయా రాజకీయ ఎత్తుగడతో బీజేపీ, వైసీపీ ముందుకెళ్తున్నాయి. ‘రాష్ట్రానికి రూ. పది లక్షల కోట్లు ఇచ్చాం. అయినా అభివృద్ధి కానరావడం లేదు..’ అని విశాఖ సభలో అమిత్ షా ఆక్షేపించారు. నిజానికి ఈ ప్రశ్న అడగాల్సింది ఎవరిని? సీఎం జగన్ రెడ్డినా లేక ప్రజలనా? డజను సీబీఐ కేసులు, అరడజను ఈడీ కేసులతో జగన్ రెడ్డి పంచప్రాణాలూ కేంద్ర పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. వారి అభీష్టానికి వ్యతిరేకంగా జగన్ ఒక్క నిర్ణయమైనా తీసుకోగలరా? రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ముస్లిం మైనారిటీలు, దళితులు కాషాయ పార్టీని వ్యతిరేకిస్తారు.

2019 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈ వర్గాలు వైసీపీతోనే ఉండేవిధంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది. ఇప్పుడు బాబు, పవన్​ తేరుకోకుంటే వాళ్ల పుట్టి మునిగినట్లే. వెంటనే బయటపడి వైసీపీ, బీజేపీ ఒకటేనని టార్గెట్ చేయకుంటే ప్రమాదంలో పడ్డట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎన్నికలాట మొదలైంది. మళ్లీ ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని బీజేపీ మెడలు వంచుతామని వైసీపీ నినాదమిచ్చే అవకాశముంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ వీధుల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఎందుకు ఆమోదించరని ప్రశ్నిస్తుంది. జాతీయ ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్యమా అంటూ నిలదీస్తుంది. వెనుకబడిన జిల్లాలకు బుందేల్​ఖండ్​తరహా ప్యాకేజీ ఎందుకివ్వలేదని రోడ్డెక్కుతుంది. విశాఖ–కాకినాడ కారిడార్‌‌ను ఎందుకు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా తాము సొంతంగా నిర్మించుకుంటున్నామంటూ బీజేపీని బోనులో నిలబెడుతుంది.

నాలుగేళ్ల నుంచి విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందంటూ మైకులు దద్దరిల్లేట్లు చేస్తుంది. ఇంతటి ద్రోహానికి పాల్పడిన కాషాయ పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు, పవన్‌ను జనం నిలదీయాలని కోరుతుంది. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గుట్టు బట్టబయలు చేసేనా?

ఇప్పుడు చంద్రబాబు, పవన్ పరిస్థితేంటీ! వైసీపీ–బీజేపీ అరవీర భయంకర యుద్ధాన్ని విశ్వసిస్తారా.. అందుకనుగుణంగా కమలనాధులను కౌగిలించుకుంటారా? లేక ఇరువురూ కలిసి ఆ రెండు పార్టీల కొట్లాట గుట్టును బట్టబయలు చేస్తారా? అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తుపై టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల్లోనూ మిశ్రమ అభిప్రాయాలున్నాయి. కాషాయ పార్టీ మీద పెరిగిన వ్యతిరేకత తమ కొంప ముంచుతుందనే భావన కొందరిలో బలంగా ఉంది. బీజేపీ సహకారంతో వైసీపీని నిలువరించాలని మరొకొందరి అభిప్రాయం. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనే అంశంపై బాబు, పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపినా ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఏమేరకు సహకరిస్తుందో గ్యారెంటీ లేదు. సత్వరమే ఏదో ఒక నిర్ణయం తీసుకోకున్నా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

తెరపైకి పాత వ్యూహం..

వాస్తవానికి ఎన్నికల్లో నెగ్గడం కోసం వైసీపీకి బీజేపీ సహకారం ఏమాత్రం అవసరం లేదు. ఆ పార్టీతో జతకడితే వైసీపీకి ఇంకా నష్టం. ముస్లిం మైనార్టీలు దూరమవుతారు. గత ఎన్నికల ముందు కూడా హోదా, విభజన హామీల అమలు కోసం వైసీపీ పెద్ద ఎత్తున కొట్లాడింది. పార్లమెంటు ఉభయ సభల్లో కత్తులు దూసింది. అవిశ్వాస తీర్మానం పెట్టింది. చట్టసభల వెలుపల ఆ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షదాకా వెళ్లారు. అధికారానికి వచ్చిన వెంటనే బీజేపీకి సాగిలపడ్డారు. కాషాయపార్టీకి అంత మెజార్జీ రాకుంటే మెడలు వంచేవాళ్లమన్నారు. నిరంతరం అడుగుతుంటామంటూ వచ్చారు. నాలుగేళ్ల నుంచి కేసులు, అప్పులకు సంబంధించి కేంద్రం సహకారం లేకుండా ఒక్క రోజు కూడా గడిచిన పరిస్థితి లేదు. అక్కడ మోడీషా ఆదేశిస్తారు.. ఇక్కడ జగన్​ అమలు చేస్తారనేంతగా వీళ్ల బంధం కొనసాగింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేళ పాత వ్యూహాన్ని తెర మీదకు తెచ్చినట్లు విపక్షాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇరు పార్టీల వైఖరేంటి?

చంద్రబాబు, పవన్​ ఇతర పక్షాలతో కలిసి వైసీపీ–బీజేపీ వ్యూహాన్ని ఛేదిస్తారా! లేక ఏదైనా జరగనీ అంటూ బీజేపీతో బంధానికి సిద్ధపడతారా? అనేది రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. ఏదో ఒకటి తేల్చకుండా కొన్నాళ్లపాటు నాన్చేందుకు వైసీపీ, బీజేపీ తావివ్వడం లేదు. ఆ రెండు పార్టీలు పోరాటాన్ని ముమ్మరం చేస్తే టీడీపీ, జనసేన ప్రేక్షకపాత్రలోకి జారి పోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే బాబు, పవన్ చావోరేవో తేల్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ముందుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల స్పందన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story