కాషాయం.. ఎవరి పక్షం! తేలుస్తుందా.. నాన్చుతుందా ?

by Hamsa |   ( Updated:2023-08-27 06:49:15.0  )
కాషాయం.. ఎవరి పక్షం! తేలుస్తుందా.. నాన్చుతుందా ?
X

రాష్ట్ర రాజకీయాలు రసకందాయానికి చేరాయి. దొంగ ఓట్లు చేర్పించారంటూ టీడీపీ, వైసీపీ మధ్య రగడ నడుస్తోంది. రెండు పార్టీలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాయి. ఇరు పార్టీల నేతలు హోంమంత్రి అమిత్​ షాను కలిసి వివరించనున్నారు. దీంతో కాషాయ పార్టీ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.. మరెవర్ని దూరం పెడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల పంచాయితీని సీఈసీ ద్వారా కేంద్రం తేలిస్తే కమలనాథులు ఎవరి పక్షమో తేలిపోతుంది. సమస్యను పరిష్కరించకుండా నాన్చితే మరికొంత కాలం దాగుడు మూతలు కొనసాగిస్తుందని భావించొచ్చు. పొత్తుల విషయంలో చివరిదాకా నాన్చే ధోరణి అవలంబించవచ్చని విశ్లేషకుల అంచనా.

దిశ, ఏపీ బ్యూరో: ఓటరు జాబితాల్లో నకిలీ ఓటర్లను చేర్పించారంటూ ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​ ఇటీవల సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇద్దరు అధికారులపై వేటేసింది. లోతుగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో అసలు ఎక్కడెక్కడ దొంగ ఓట్లు చేర్పించారంటూ టీడీపీ తవ్వకాలు మొదలు పెట్టింది. వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి, హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. టీడీపీ హయాంలోనే నకిలీ ఓటర్లను చేర్పించారంటూ అధికార వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సీఈసీ, అమిత్​ షాకు ఫిర్యాదు చేయడానికి సిద్దమైంది.

ఎన్డీయేలో భాగస్వామి అవుతుందా?

ఇప్పుడు బీజేపీ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఇండియా టుడే – సీ ఓటర్ తాజా సర్వే టీడీపీకి 15 ఎంపీ సీట్లు రావొచ్చని అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ ఎన్డీయేలో భాగస్వామ్య పక్షం అవుతుందని కూడా పేర్కొంది. దీన్నిబట్టి కాషాయ నేతలు టీడీపీ ఇచ్చే ఫిర్యాదులకు అనుకూలంగా వ్యవహరించవచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు సీఎం జగన్​కు వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అప్పులపై తీవ్ర ఆరోపణలు చేస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. దీన్నిబట్టి కాషాయ నేతలు సీఎం జగన్​ను వదులుకోవడానికి సిద్దపడకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏదేమైనా బీజేపీకే లాభం వచ్చేలా..

టీడీపీని మరింత అభద్రతాభావంలోకి నెట్టేందుకు బీజేపీ నేతలు ఓట్ల పంచాయతీని నాన్చవచ్చనే ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ఎన్నికలు సమీపించేదాకా సమస్యను తేల్చకపోవచ్చంటున్నారు. ఈలోగా వైసీపీ వర్సెస్​ జనసేన అనేట్లు వాతావరణం సృష్టించడం ద్వారా టీడీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలనే ఎత్తుగడ అమలు చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్​ ను మరోసారి గెలిపించాలనుకుంటే జనసేనను టీడీపీ వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే అవకాశముంది. అందుకు జనసేన అంగీకరించకుంటే ప్లాన్​ బీ ప్రకారం బీజేపీ, జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనేది కాషాయ పార్టీ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గెలిస్తే బలాన్ని పెంచుకోవచ్చు. ఓడితే పాత మిత్రుడు జగన్​ ఎలాగూ సహకరిస్తాడనే భావనతో బీజేపీ నేతలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story