చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం : CM Jagan

by samatah |   ( Updated:2023-01-11 09:24:41.0  )
చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం : CM Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని, ఆ వడ్డీల భారం అధికమై తీసుకున్న రుణాలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారు, వీధి వ్యాపారులకు అండగా నిలవాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సంకల్పయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశా. వారి బాధలు విన్నాను. అందుకే నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాను. వారికి అండగా ఉంటున్నాం'అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలోని చిరువ్యాపారుల కష్టాలను దగ్గరి నుంచి చూసి, వారి కష్టాలను తీర్చేందుకే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చిరువ్యాపారులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారంటీ లేకుండా రూ.10 వేల రుణం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం 'జగనన్న తోడు' పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. చిరు వ్యాపారులకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అత్యధికంగా వడ్డీ లేని రుణాలిస్తున్న ప్రభుత్వం మనదే : సీఎం జగన్

ప్రజా సంకల్ప యాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని.. అధిక వడ్డీలకు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేక, చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఎందరో అభాగ్యులకు అండగా ఉంటానని నాడు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. చిరువ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా క్రమం తప్పకుండా అర్హులందరికీ రూ.10 వేల వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రుణం తిరిగి చెల్లించినవారికి మళ్లీ రుణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 15,31,347 మంది లబ్ధిదారులకు రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందని వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఈ రుణాలకు సంబంధించి చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని తెలిపారు. ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి జమ చేసినట్లు తెలిపారు. గత 6నెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీఎంబర్స్ మెంట్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ. 63 కోట్లకు పైగా వడ్డీ తిరిగి చెల్లించామని చెప్పుకొచ్చారు. చిరువ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడారు. అర్హత ఉండి కూడా జగనన్న తోడు పథకం అందని చిరువ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.

జగనన్నే వన్స్‌మోర్‌ : మంత్రి ఆదిమూలపు సురేశ్

ప్రతి నిరుపేద ఉపాధికి ఊతమిస్తూ వారు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు సైతం నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. అందుకే ఎవరిన్ని మాయమాటలు చెప్పినా, అబద్ధాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ప్రజలు మాత్రం జగనన్నే వన్స్‌మోర్‌ అని అంటున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story