ప్రమోషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కొత్త కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం

by Seetharam |
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్‌తో మరో కొత్త కమిటీ నియామకానికి రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్‌ అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు ఈ కొత్త కమిటీని నియమించనుంది. రివిజన్‌ ఆఫ్‌ ప్యానెల్స్‌ విషయంలో ఐఏఎస్ అధికారి‌తో మరొక కొత్త కమిటీని ఏర్పాటు చేయబోతుందని దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కమిటీ నియామకంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన కోసమే కమిటీలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ అంశంపై 2018లో ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించిందని.. అయితే కోర్టు ఆదేశాలను ఇప్పటి వరకు అమలు చేయకుండా ప్రభుత్వం దోబూచులాడుతోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అలసత్వం వల్ల ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో తీరని అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు ఇప్పటికే సెక్రటేరియట్‌ ఓసీ, బీసీ ఎంప్లాయిస్‌ అసోసియేష్‌ హైకోర్టులో కంటెంప్ట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అనంతరం లా డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక సలహా కమిటీ ప్రభుత్వం నియమించింది. తాజాగా ప్రభుత్వం మరో కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఏపీ సచివాలయ ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కాలయాపన చర్యలు మానుకుని కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఓసీ,బీసీ,మైనారిటీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.

Advertisement

Next Story