చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ

by Javid Pasha |   ( Updated:2023-09-19 03:19:55.0  )
చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారానికి సంబంధించి నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. దీంతో ఇవాళ చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అలాగే చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో ఆయన తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకొచ్చే అవకాశముంది. అలాగే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినా వెంటనే రిలీజ్ అవుతారు. దీంతో చంద్రబాబు కేసుల్లో ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది కీలకంగా మారింది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదేశాల్లోని తెలుగువారు కూడా నిరసనలు చేపడుతున్నారు.

Read More..

మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన పవన్ కల్యాణ్

Advertisement

Next Story