దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి

by Mahesh |
దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు భూ అక్రమాల‌పై సీఐడీ లేదా సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పీలేరులో భూ అక్రమాలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దమ్ముంటే సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో ఛాలెంజ్ చేశారు. భూ ఆక్రమణలు నిర్ధారిస్తూ గతంలో కలెక్టర్ రూపొందించిన నివేదికను తన లేఖకు లోకేష్ జత చేశారు. పీలేరు ఎమ్మెల్యే శాసనసభలో కోరినట్లు విచారణ జరిపించే దమ్ముందా అంటూ అంటూ సవాల్ విసిరారు.

రాష్ట్రంలో భూ మాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ భూ మాఫియా పెట్రేగిపోతుందని ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న వదలకుండా ఆక్రమించుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వం భూ మాఫియాపై చర్యలు తీసుకోక పోగా సహకారం అందించడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఒక్క పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 601.37 ఎకరాల భూమిని ఈ భూ మాఫియా దోచుకుంది అని లేఖలో మరోసారి ఆరోపించారు. టీడీపీ పోరాటంతో చిత్తూరు కలెక్టర్‌ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ జరిపించిన విషయాన్ని గుర్తు చేశారు.

మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ తన నివేదికలో సిఫార్స్ కూడా చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాఫియా పట్ల ఉదాసీనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని.. పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో భూ కబ్జాకు పాల్పడిన ల్యాండ్ మాఫియా పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

అధికార వైసీపీ నేతలకు భూ మాఫియాతో ప్రమేయం ఉన్నందుకే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయని దీనిపై మీ సమాధానం ఏంటని నిలదీశారు. పీలేరులోని భూ కుంభకోణంపై సీఐడీ లేదా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గ‌తంలో శాసనసభలో కోరిన వీడియోను సైతం సీఎం జగన్‌కు రాసిన లేఖలో జత చేశారు.

Advertisement

Next Story