ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి

by Prasanna |
ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నుంచి మరో పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా రూరల్ కార్యాలయంలో ముఖ్య నేతలు, అనుచరులు, మైనారిటీ నేతలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమై తన పోరాట కార్యచరణను తెలియజేశారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం జి.ఓ. జారీచేసిన రూ.15 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి నెలరోజులపాటు ప్రతి మసీదు, ప్రతి దర్గాకు వెళ్లి అక్కడినుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్, పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞాపనలు అందించే మరో పోరాటానికి సిద్దమైనట్లు తెలియజేశారు.ఈ పోరాటం నెలరోజులపాటు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనందువల్ల 7.5 కోట్లతో మసీదు నిర్మాణం కోసం 4సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏక్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం ఉందని..అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. మేరకు రూ.15 కోట్లు నిధులు విడుదల చేస్తూ, ఆర్థికశాఖ అనుమతి ఇవ్వాలని కోరారు. రాబోయే నెలరోజులలో నెల్లూరు జిల్లా నుంచి లక్ష మందిచేత ముఖ్యమంత్రి కార్యాలయానికి, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్, పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞాపనలు అందిస్తామని వెల్లడించారు. ఇదే అంశంపై త్వరలో హై కోర్టును సైతం ఆశ్రయించబోతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.

Also Read..

అగ్గిపెట్టెలో దుర్గమ్మకు చీర.. అమ్మవారికి కానుకగా అందజేసిన సిరిసిల్ల చేనేతకారుడు విజయ్

Next Story

Most Viewed