నా సినిమాలు ఆపేసినా..బెదిరించినా ఢిల్లీ పెద్దల సాయం కోరలేదు: పవన్ కల్యాణ్

by Seetharam |
నా సినిమాలు ఆపేసినా..బెదిరించినా ఢిల్లీ పెద్దల సాయం కోరలేదు: పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘జనసేన పార్టీకి యువతే బలం. మన పార్టీకి ఉన్న యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు ఉంది’జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని...యువతే పెద్ద బలమని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వెంట వస్తున్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశాం. ఖమ్మం, మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారు’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

స్వార్థం వదిలేయాలి

ఇతర రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తాను. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలి. ఏపీ భవిష్యత్తును ఒక నిర్ధిష్టమైన విధానంలో అభివృద్ధి పథంలో నడిపించాలి. ఏపీలో ఎన్నికల కోసం వంద రోజుల సమయమే ఉంది. మనం ప్రజల్లోకి వెళ్లాలి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు గుండె ధైర్యం తప్ప నాతో ఎవరూ లేరు. జనసేనకు బలం మన యువతరం. రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో నేను పార్టీ పెట్టాను. జనసేనకు 13వేల మందిగా ఉన్న యువత నేడు 6 లక్షలకు చేరారు. ప్రజలు నాకు ఇస్తున్న గౌరవంతో నాకు మరింత కృతజ్ఞత పెరుగుతుంది. సమస్యలు పట్ల స్పందించడమే నా‌ విధానం. సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన చెందాను. పది మందికి డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా యువత తరలి వస్తున్నారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


వైసీపీకి భావజాలం లేదు

వైసీపీకి భావజాలం లేదు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎందుకోసం పనిచేస్తున్నారో వారికే తెలియదని చెప్పుకొచ్చారు. అన్న ముఖ్యమంత్రి కావాలి..అందుకోసం పనిచేస్తున్నాం అని చెబుతారు అని మండిపడ్డారు.‘నేను ఏం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా. సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది. హైదరాబాద్‌లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం చాలా బాధ కలిగించింది. నా సినిమాలు ఆపేసినా, నేను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా మన పోరాటం మనమే చేసుకున్నాం తప్ప ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి మీ సహాయం కావాలని చేయిచాచి అడగలేదు. ఎందుకంటే ఇది మన నేల.. మన పోరాటం. కుదిరితే మనం వారికి బలం అవ్వాలి. కానీ మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరు. పోరాటం చేసే వాళ్లనే వారు గుర్తిస్తారు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.‘బీజేపీ, టీడీపీతో‌ ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed