వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నాశనం.. హోం మంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్

by Ramesh Goud |
వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నాశనం.. హోం మంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని, కేంద్ర నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చెయ్యలేదని, విశాఖ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డు కిందే నడుస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించానని, వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కేవలం బందోబస్తుకే వాడారు తప్ప ఒక్క కానిస్టేబుల్‌ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని తెలిపారు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్‌ అకాడమీలు లేవని, కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణం పూర్తిచేయలేదని ఫైర్ అయ్యారు.

నేటికీ విశాఖపట్నం జిల్లాలో ఓ పోలీస్‌స్టేషన్‌ రేకుల షెడ్డులోనే నడుపుతున్నారని, ఎస్కార్ట్‌ వాహనాలు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కనీసం ఠాణాల్లో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. అలాగే గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగి, క్రైం రికార్డులో రాష్ట్రాన్ని మూడో స్థానానికి దిగజర్చారని అన్నారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశామని, 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనేదానిపై ఉపసంఘంలో చర్చించడం జరుగుతుందన్నారు. అంతేగాక ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టేందుకు వీలుంటుందని, మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని, కలిసి కట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామని స్పష్టం చేశారు.

ప్రజలు ధైర్యంగా స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా పోలీసులు భరోసా ఇవ్వాలని, సిబ్బంది ప్రజలతో మర్యాదగా మెలగాలని సూచించారు. రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యం ఘటనలు చాలా జరుగుతున్నాయిని, ఫిర్యాదులతో ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా మాట్లాడవద్దని అన్నారు. పోలీసులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులకే గత ప్రభుత్వం వినియోగించిందని, ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్‌ రావాలన్నారు. కొంతమంది ఐపీఎస్‌ అధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని, నాపైనే 23 కేసులు నమోదు చేశారని, అక్రమ కేసులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, సోషల్‌ మీడియాలో తాను కూడా బాధితురాలినేనని అన్నారు. పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తామని, ఏపీలో దిశ చట్టమే లేదు.

ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామని అన్నారు. ఇక నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని, గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ పై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘రెడ్‌ బుక్‌’ కక్ష సాధింపు చర్యలకు కాదని, గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకేనని స్పష్టం చేశారు. ఇక తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?, పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన‌ ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed