పిఠాపురం చరిత్రలో అలా జరుగలేదు.. మరి ఈసారి?

by GSrikanth |
పిఠాపురం చరిత్రలో అలా జరుగలేదు.. మరి ఈసారి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. గతేడాది పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి అయినా గెలుస్తారా? లేదా? అని ఒకవర్గం, గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుంది? అని మరో వర్గం చర్చోపచర్చలు చేస్తున్నాయి. అయితే పిఠాపురం చరిత్రను పరిశీలిస్తే తప్పనిసరిగా పవన్ కల్యాణ్ గెలుస్తారని తెలుస్తోంది. 1989 నుంచి ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. 2009లో ప్రజారాజ్యం నుంచి వంగ గీత, 20014లో టీడీపీ అభ్యర్థి వర్మ, 2019లో వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుపొందారు. దీంతో పవన్ కల్యాణ్ గెలుపుపై అంచనాలు పెరిగిపోయాయి.

మొత్తంగా పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 115,717 మంది పురుషులు కాగా.. 113,869 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ కాపు ఓటర్లు సుమారు 75 వేల మంది ఉండగా.. ఎస్సీలు 28 వేల మంది ఉన్నారు. ఇందులో మాలలు 20 వేలు కాగా, మాదిగలు 8 వేల వరకు ఉన్నారు. 23 వేల మంది శెట్టి బలిజ ఓటర్లు ఉన్నారు. మత్స్యకారులు 17 వేలు, పద్మశాలి, 16 వేలు, రెడ్డి 10 వేల మంది ఉన్నారు. కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు, క్షత్రియ 6 వేల మంది ఉన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ కూడా నమోదైంది. ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరి వీరు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారో ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాలి.

Advertisement

Next Story