రాష్ట్రంలో భారీ వర్షాలు..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి

by Jakkula Mamatha |   ( Updated:2024-08-31 14:22:55.0  )
రాష్ట్రంలో భారీ వర్షాలు..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల పై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు(శనివారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తం చేయాలన్నారు.

వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునగడం పై మంత్రి ఆరా తీశారు. కాలువల్లో నీరు పారేలా అడ్డంకులు తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ వర్ష ప్రభావం తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా అందుబాటులోనే ఉన్నారని వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

Advertisement

Next Story

Most Viewed