హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Seetharam |   ( Updated:2023-11-10 07:08:31.0  )
హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈనెల 15కు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నేడు విచారణను వాయిదా వేసింది. అయితే నేడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరగాల్సి ఉండగా ఈ విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరుకాలేదు. ఏఏజీ నేటి విచారణకు హాజరుకాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలియజేశారు. వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఇకపోతే ఇదే స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్‌ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవులు తరువాత తీర్పు వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్యధర్మాసనం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడైన తర్వాత హైకోర్టు కూడా తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed