ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by srinivas |
ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని...తెలంగాణ రాష్ట్రంతోపాటే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేశారు. అమరావతిలో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని.. వారు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు.

మరోవైపు పొత్తులపైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని..అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందువల్లే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇకపోతే టీడీపీ మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. కర్ణాటక మేనిఫెస్టోను, వైసీపీ మేనిఫెస్టోను కాపీకొట్టి మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడటానికి ఏముందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Advertisement

Next Story