అంతవరకు రానివ్వద్దు .. ప్రభుత్వానికి Ap Jac Amaravati హెచ్చరిక

by srinivas |   ( Updated:2023-01-21 11:04:13.0  )
అంతవరకు రానివ్వద్దు .. ప్రభుత్వానికి Ap Jac Amaravati హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి 'చలో విజయవాడ' వరకు రానివ్వద్దని ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రభుత్వం నెరవేర్చే కోరికలే తాము కోరుతున్నామని, నెరవేర్చని కోరికలు కోరడం లేదని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఇక మరో పోరాటానికి రెఢీ అవుతామని హెచ్చరించారు. గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.ఎల్‌.కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘ రాష్ట్ర సమావేశానికి ముఖ్యఅతిథిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు, ఉద్యోగవిరమణ వయసు 62 సంవత్సరాలకు పెంపును విశ్వవిద్యాలయాలు, గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి కూడా ఏకకాలంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్సిటీల ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు డబ్బుల్లేక పోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం తీర్చలేని కోరికలు ఉద్యోగులు అడగటం లేదని, పీఆర్సీపై చర్చల్లో అంగీకరించిన వాటిని మాత్రమే అమలు చేయాలని తాము కోరుతున్నామన్నారు. జీతాల గురించి కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్‌ వద్దకు వెళ్లడం నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళన కలుగుతుందన్నారు.

ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం మరోసారి 'చలో విజయవాడ' నిర్వహించకుండా చూడాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డికి బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు నేరుగా ముఖ్యమంత్రితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. సీపీఎస్‌ రద్దు విషయాన్ని త్వరగా తేల్చాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డా.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సకాలంలో జీతాలు రావడం లేదనే బాధ యూనివర్సిటీ ఉద్యోగుల్లో ఉందన్నారు.

ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆచార్యుల ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి చెప్పినా ఇంకా ప్రక్రియ చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలన్నారు. బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : ఆ 56 మంది పదవీకాలం పొడిగింపు.. Ycp Government కీలక ఉత్తర్వులు

Advertisement

Next Story

Most Viewed