Vangalapudi Anita: మాది ముద్దుల పాదయాత్ర కాదు... బుద్ధి చెప్పే యాత్ర

by srinivas |   ( Updated:2022-12-28 14:00:35.0  )
Vangalapudi Anita: మాది ముద్దుల పాదయాత్ర కాదు... బుద్ధి చెప్పే యాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌కి బుద్ధిచెప్పడానికి ప్రతిమహిళా, ప్రతిబిడ్డా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను ఆదరించాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మూడున్నరేళ్ల జగన్ పాలన కీచకపాలనను తలపిస్తోందన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలే నిదర్శనమన్నారు. జగన్ పాలనలో మహిళల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతిరోజూ 5, 6 సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరుగుతోందని అనిత పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సమయంలో జగన్ రెడ్డి మహిళల్ని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి, వారి ఓట్లుదండుకోవడానికి అన్నా అనే పిలుపుతో వారిని మోసగించారని ధ్వజమెత్తారు. రక్షణ విషయంలో పసికందు మొదలు న్యాయమూర్తులుగా ఉన్న మహిళల వరకు ఎవరూ ప్రశాంతంగా లేరని ఆరోపించారు. వలంటీర్ మొదలు మంత్రివరకు అందరూ మహిళల్ని కించపరిచేవారేనని వంగలపూడి అనిత విమర్శించారు.

మహిళల మానప్రాణాలు రక్షించడానికి, కీచకపాలనకు ముగింపు పలకడానికి లోకేశ్ సిద్ధమవ్వడం సంతోషకరమన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సాగే లోకేశ్ పాదయాత్ర జగన్ రెడ్డి చేసిన ముద్దుల పాదయాత్ర కాదని అనిత తెలిపారు. తన అన్న, తన బిడ్డ, తమ కోసం వచ్చాడని ప్రతిమహిళ భావించేలా లోకేశ్ ఆడబిడ్డల ఆవేదనను తెలుసుకుంటారని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. 'కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నా, స్వాతంత్ర్యం రోజున నడిరోడ్డుపై యువతిని పొడిచి చంపినా ముఖ్యమంత్రి స్పందించరు. జగన్‌కి బుద్ధి చెప్పడానికి ప్రతి మహిళా, ప్రతి ఆడబిడ్డా లోకేశ్‌ను ఆదరించాలి. 151 సీట్లు పొంది మహిళల్ని రక్షించలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్... దిశాచట్టం పేరుతో ఆడబిడ్డల్ని వంచిస్తున్న దగా కోరు జగన్ అని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తే మహిళలే తగిన బుద్ధి చెబుతారని పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి : ఇది మాన‌వ‌త్వమేనా?... Cm Jaganకు నారా లోకేశ్ లేఖ

Advertisement

Next Story

Most Viewed