- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమరావతి రైతుల మహా పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో : అమరావతి రైతుల పోరాటానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 12 నుంచి చేపట్టబోయే మహా పాదయాత్రకు రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే అవకాశం కల్పించింది. అలాగే పాదయాత్ర చేసే 600 మందికి సంబంధించిన ఐడీ కార్డులు ఇవ్వాలని, పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. అలాగే పాదయాత్ర ముగింపు రోజుకు సంబంధించి నిర్వహించే బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు హైకోర్టు సూచించింది. అనంతరం రైతుల దరఖాస్తును పోలీస్ శాఖ పరిశీలించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అనుమతి నిరాకరించిన డీజీపీ..
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమల వరకు 60 రోజుల పాటు పాదయాత్ర చేసిన రైతులు తాజాగా మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నుంచి అరసవెళ్లి వరకు పేరుతో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
ఇందుకు అనుమతి కోసం అటు ప్రభుత్వానికి, ఇటు పోలీస్ శాఖ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఇరు శాఖల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించగా గురువారం వాదనలు జరిగాయి. ఇరువురి వాదనల అనంతరం రాజధాని రైతులు నిర్వహించతలపెట్టిన మహాపాదయాత్రపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింది.
గురువారం సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో డీజీపీ తమ వైఖరిని స్పష్టం చేశారు. గురువారం రాత్రి రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అర్ధరాత్రి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపించారు.
ఈ ప్రతిలో అనేక కారణాలను వెల్లడించారు. గతంలో చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో హైకోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారని వివరించారు. పాదయాత్ర సాగిన వివిధ జిల్లాలో 71 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఉత్తర్వుల్లో ఆరోపించారు. అంతేకాదు ఆయా జిల్లాల పోలీసు అధికారుల సూచనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిమిత ఆంక్షలతో అనుమతులు..
పోలీస్ శాఖ ఉత్తర్వుల కాపీని రైతుల తరపున హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు మురళీధర్, వీవీ లక్ష్మీనారాయణలు ధర్మాసనానికి అందజేశారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం అమరావతి రైతులు పాదయాత్రకు అనుమతినిచ్చింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర సాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది. రైతుల దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది.
అలాగే పాదయాత్రలో 600 మంది పాల్గొనేలా ఆదేశాలు జారీ చేసింది. పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉంటే మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం సెప్టెంబర్ 12 కు వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటుంది.
ఆ రోజు అన్ని పార్టీలతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. అదే రోజు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా అరసవల్లి వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు అసెంబ్లీ నుంచి అరసవెల్లిగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర సుమారు 70 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే తాట తీస్తాం: Kavali Greeshma