అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు

by M.Rajitha |   ( Updated:2024-10-14 13:15:16.0  )
అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజులపాటు అమరావతిలో జరగనున్న డ్రోన్ సదస్సు(Amaravathi Drone Summit) నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలో అక్టోబర్ 22, 23 తేదీల్లో జరిగే 2024 డ్రోన్ సదస్సు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ సదస్సు నిర్వహణలో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను భాగస్వామిగా నియమించినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయానశాఖ కార్యదర్శి పుల్నం హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈనెల 15 వరకు 'అమరావతి డ్రోన్ సమ్మిట్' వెబ్సైట్ లో ఉచితంగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచడం కోసం ఈ సమ్మిట్ జరగనుండగా.. అత్యాధునిక సేవలు అందించే డ్రోన్లు తయారీ చేసిన వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు అందజేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed