మాజీ మంత్రి బొత్స దూకుడు.. ప్రచారంలో దూసుకుపోతూ విజయంపై ధీమా

by srinivas |   ( Updated:2024-08-10 10:17:02.0  )
మాజీ మంత్రి బొత్స దూకుడు.. ప్రచారంలో దూసుకుపోతూ విజయంపై ధీమా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను కలుస్తూ తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. విశాఖ కార్పొరేట్లను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎలాగైనా సరే ఎమ్మెల్సీగా తాను గెలిచేందుకు బొత్స సత్యనారాయణ చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్తున్నారు.

ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాలో ఘోరంగా ఓటమి పాలైంది. అత్యధిక స్థానాల్లో కూటమి నేతలు గెలిచారు. దీంతో ఎలాగైనా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని వైసీపీ నాయకత్వం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వైసీపీ ప్రజా ప్రతినిధులను కలిసి దిశానిర్దేశం చేశారు. పాడేరు, అరకు, విశాఖకు సంబంధించిన వైసీపీ నేతలను కలిసి తమ అభ్యర్థి బొత్సకు ఓటు వేయాలని సూచించారు. అంతేకాదు అరకు, పాడేరుకు చెందిన 105 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బెంగళూరు విహారయాత్రకు పంపారు. తమ నుంచి జారీ పోకుండా కట్టడి చేశారు.

మరోవైపు విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్నిఅధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కుంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే బలం తక్కువగా ఉండటంతో గెలుపుపై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరుగురు టీడీపీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఎలాగైనా సరే ఎమ్మెల్సీని దక్కించుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story