జగన్ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీబీఐ మాజీ జేడీ

by Hamsa |   ( Updated:2023-05-14 10:06:06.0  )
జగన్ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీబీఐ మాజీ జేడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు థాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు AP ప్రభుత్వానికి ధన్యవాదాలు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన భూపత్రాలు త్వరలో లభిస్తాయని ఆశిస్తున్నాను’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ హ్యాండిల్ రిప్లై ఇచ్చింది. ‘థ్యాంక్యూ లక్ష్మీ నారాయణ గారూ! ఇది జగనన్న ప్రభుత్వం.. మన రైతన్న ప్రభుత్వం. దశాబ్దాల నాటి చుక్కల భూమి చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి రైతుల భూములకు సర్వ హక్కులు కల్పించిన రైతు బాంధవుదు సీఎం వైఎస్ జగన్. ఇదీ రైతన్నల పట్ల జగనన్న ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి’ అని ట్వీట్ చేసింది.

ఇకపోతే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన జేడీ లక్ష్మీనారాయణ గురించి ఆయన సన్నిహితులు అధికార యంత్రాంగానికి మాత్రమే తెలుసు. అయితే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణాధికారిగా రావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. సీబీఐ జేడీగా వైఎస్ జగన్‌ను విచారించడం.. అనంతరం అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణ పేరు మార్మోగిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వీఆర్ఎస్ తీసుకున్న లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేనకు గుడ్ బై చెప్పేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తనకు అటు వైసీపీతోపాటు ఇటు బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ఇటీవలే వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read..

అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు నాయుడు

Advertisement

Next Story

Most Viewed