ఏపీలో ఫెయింజల్ కల్లోలం.. కోతకు గురైన తీరాలు, కొట్టుకుపోయిన ఇళ్లు

by Rani Yarlagadda |
ఏపీలో ఫెయింజల్ కల్లోలం.. కోతకు గురైన తీరాలు, కొట్టుకుపోయిన ఇళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ సైక్లోన్ (Fengal Cyclone) శనివారం రాత్రి 10.30 నుంచి 11.30 గంటల మధ్య పుదుచ్చేరి (Puducherry) సమీపంలో తీరం దాటిందని ఐఎండీ (IMD) వెల్లడించింది. ఈ సైక్లోన్ క్రమంగా పశ్చిమ - నైరుతి దిశగా కదులుతూ బలహీన పడనుంది. తీరందాటినా సైక్లోన్ ఎఫెక్ట్ ఏపీ జిల్లాలపై కనిపిస్తోంది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల అతి భారీవర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.

ఫెయింజల్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కృష్ణపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 70 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో.. అధికారులు పర్యాటకులను రావొద్దని హెచ్చరించారు. మరోవైపు శ్రీకాకుళంలోనూ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో.. కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

తుఫాన్‌ ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ, ఉప్పాడ, అంతర్వేదిలో అలలు ఎగసిపడుతున్నాయి. అలల ఉధృతికి మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. మాయపట్నం, అమీనాబాద్‌, సూరాడపేట, కొత్తపట్నం, జగ్గరాజుపేట, సుబ్బంపేటలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Advertisement

Next Story

Most Viewed