Raghuveera Reddy: నాన్న ట్రాక్టర్ తో సాగు పనులు గొప్ప అనుభూతి : మాజీ మంత్రి రఘువీరారెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-05 07:44:18.0  )
Raghuveera Reddy:  నాన్న ట్రాక్టర్ తో సాగు పనులు గొప్ప అనుభూతి : మాజీ మంత్రి రఘువీరారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వారసత్వంగా వచ్చే ఆస్తులు..వస్తువులు పిల్లలకు తమ పెద్దల జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారితో గడిపిన స్మృతులను యాదిలోకి తెస్తుంటాయి. సరిగ్గా అలాంటి అనుభూతిని పొందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy) తన తండ్రీ జ్ఞాపకాలను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 37 సంవత్సరాల క్రితం (1987 ) నాన్న కొన్న ట్రాక్టరు(tractor)ను తను స్వయంగా నడుపుతూ కల్లంలో అండుకొర్రల నూర్పుడు పనులు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. నాన్న విడిచి వెళ్లిన జ్ఞాపకంగా ఆ ట్రాక్టర్ తో వ్యవసాయం చేయటం ఓ గొప్ప అనుభూతినిచ్చిందని రఘువీరారెడ్డి తన తండ్రితో కలిసి పొలం పనులు చేసిన రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగం చెందారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సన్నిహితుడిగా మెలిగారు. వైఎస్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణాంతరం రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో కీలక మంత్రి పదవులు చేప‌ట్టారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలోని అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అనంతరం రఘువీరారెడ్డి నాలుగేళ్ళ పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొంటూ అందరిని విస్మయానికి గురి చేశారు. తిరిగి 2023ఏప్రిల్ లో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సీడబ్ల్యుసీ మెంబర్ గా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story