తిట్టడానికే రూ. కోట్లు.. జడ్జీలను దూషించిన కేసులో నిందితురాలికి ఉద్యోగం

by Anjali |
తిట్టడానికే రూ. కోట్లు.. జడ్జీలను దూషించిన కేసులో నిందితురాలికి ఉద్యోగం
X

దిశ ప్రతినిధి, అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ బండారాలు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను బూతులు తిట్టేవారితో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను వైపీపీ పెద్దలు నింపేసిన తీరు చూసి కూటమి నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగ నియామకాలకు అర్హత అంటూ ఏమీ లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిని బాగా తిట్టడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడమే ఏకైక అర్హతగా వందల మందితో ఏపీడీసీని నింపేశారు. చివరకు న్యాయమూర్తులను దూషించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి కూడా ఇక్కడే అవకాశాలు కల్పించి నెలకు రూ.లక్ష చొప్పున జీతాలు కూడా చెల్లించారు.

కాపీ పేస్ట్ రెడ్డే చీఫ్ డైరెక్టర్ ..

ఈ కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో వుండే సీవీ రెడ్డిని చీఫ్ డైరెక్టర్‌గా జగన్ ప్రభుత్వం నియమించింది. వైఎస్ భారతమ్మ సిఫార్సుతో ఆయన ఆ పదవిలోకి వచ్చారు. పెద్దగా ప్రతిభ లేని, ఒక్క అక్షరం టైప్ చేయలేని ఆయనను అక్కడ పనిచేసే ఉద్యోగులే ‘కాపీ పేస్ట్ రెడ్డి’ అని సరదాగా పిలుచుకొనే వారు. ఆయనకు మూడున్నర లక్షల జీతం, ఇతర అలవెన్సులు నెలనెలా చెల్లించేవారు. నిజానికి ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రచారం చేయాల్సిన ఏపీడీసీ కేవలం దూషణలు, తిట్లు, బూతులకే పరిమితమైపోయింది.

వాళ్లే ఉద్యోగులు..

ఈ సంస్థలో ఉద్యోగులంతా 2014‌-19 సంవత్సరాల మధ్య వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులే. ఇక్కడ పనిచేయాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి. అది కూడా ఈ కార్పొరేషన్ ఇచ్చే సమాచారం ప్రచారం చేయడానికి కాదు, ప్రతిపక్షనేతలైన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి వారిని అదే పనిగా పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా తిట్టాలి. అలా తిడితేనే ఇక్కడ ఉద్యోగం. జీతం. ఇక్కడ జీతం అందుకొనే చాలా మంది అసలు ఆఫీసుకు కూడా వచ్చేవారే కారట. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నామని చూపించుకొని నెల నెలా జీతం తీసుకొనే వారట.

జైలుకెళ్లి వచ్చిన వారికీ ఉద్యోగం..

న్యాయమూర్తులను దూషించిన కేసులో ఒక మహిళ 14 రోజుల పాటు జైలుకి వెళ్లి వచ్చారు. ఆమెకు ఈ సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. సజ్జల భార్గవ నేతృత్వంలో నడిచిన సోషల్ మీడియాలో పనిచేస్తూ ఆమె ఇక్కడి నుంచీ జీతం తీసుకొనేవారని తెలిసింది. వైసీపీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గావుంటూ, పోలీసు కేసులు ఎదుర్కొన్న ఇంటూరి రవి కిరణ్‌కు ఈ సంస్థ నుంచి నెల నెలా రూ.73 వేలు చెల్లించేవారని తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోయారు. సీవీ రెడ్డి ఇతర పెద్దలతో పాటు నెలకు 98 వేల జీతం అందుకొన్న వై.వెంకటేశ్వర రెడ్డి, 73వేల చొప్పున అందుకొన్న రవికిరణ్, భాస్కర్ క్రాంతి, కె.రాజశేఖర రెడ్డి, షేక్ కాలీషా వలి, ఎం.మధుసూధన రెడ్డి, షేక్ మస్తాన్ వలి తదితరులు అందించిన సేవలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ మూత పడడంతో పాత ఫైళ్లను దుమ్ము దులుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed