- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కైకలూరులో కాకరేపుతున్న మాజీమంత్రి: పొత్తు ఉంటే BJP లేకపోతే Jana Sena నుంచి సై
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజకీయాల్లో వివాదరహితుడిగా ఆ నాయకుడికి మంచి పేరుంది. సొంత పార్టీలోనే కాదు ఇతర పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు పార్టీ అధినేతల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన విధేయతతో అందరివాడుగా పేరొందారు. గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది ఏకంగా మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే మెగా ఫ్యామిలీకి సైతం వీర విధేయుడు. ఇక బీజేపీ హైకమాండ్ వద్ద కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆ మాజీమంత్రి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ మాజీమంత్రి ఎవరో కాదు కామినేని శ్రీనివాస్. వచ్చే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి కుదిరితే బీజేపీ నుంచి లేదా జనసేన నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ యాత్రలో తాను అన్నీ తానై వ్యవహరించి పవన్ కల్యాణ్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. పొత్తులో టికెట్ సాధించడంతోపాటు అధికారంలోకి వస్తే కేబినెట్‌లో చోటు కూడా దక్కుతుందని ఆశిస్తున్నారు.
మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు
మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు.2009లో ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. నాడు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ చేతిలో 974 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్‌లో కొన్నాళ్లపాటు కొనసాగారు. అనంతరం రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించిన కామినేని శ్రీనివాస్ బీజేపీలో చేరారు. 2014లో కైకలూరు నియోజకవర్గం నుంచి పొత్తులో సీటు సంపాదించారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఉప్పల రాం ప్రసాద్‌పై ఏకంగా 21 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ పొత్తులో భాగంగా ఏకంగా తొలి ప్రయత్నంలో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కీలకమైన వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. నాలుగేళ్లపాటు మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు టీడీపీతో పొత్తు ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా లేరు.
విధేయత కలిసొచ్చేనా
గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కామినేని శ్రీనివాసరావు ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలుగుదేశం-జనసేనల మధ్య పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో దూకుడు పెంచారు. ఎలాగూ బీజేపీ జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నాటికి 2014 ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తాయని అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా తనకు టికెట్ వస్తుందని కామినేని శ్రీనివాసరావు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కామినేని శ్రీనివాస్ కు సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబుకు వీరవిధేయుడిగా గుర్తింపు ఉంది. అదే సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సైతం నమ్మిన బంటు. అటు మెగా ఫ్యామిలీకి సైతం వీరవిధేయుడు. ఇలా ఈ అన్ని అంశాలు తనకు కలిసి వస్తాయని టికెట్ తమదేనని బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు ఒకవేళ పొత్తులో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే తిరిగి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయని కామినేని శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీనా?జనసేననా?
కామినేని శ్రీనివాస్ గతంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. కామినేని బీజేపీని వదల్లేదు. ఇటీవల కొన్ని రోజులుగా జనసేన పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంంది. జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుందామని కామినేని శ్రీనివాస్ అనుచరులు ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ ఆచితూచి రాజకీయాల్లో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు టీడీపీ నై అంటుంది. ఒకవేళ టీడీపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. టీడీపీతో పొత్తును బీజేపీ నిరాకరిస్తే ఇక జనసేనను సైతం వదులుకోవాల్సి ఉంటుంది. జనసేన- బీజేపీల మధ్య పొత్తు చెడితే ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్ జనసేనలో చేరతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి ప్రకటన చేయడం లేదని ప్రకటన చేసే వరకు వేచి చూద్దామని చూస్తున్నారు. బీజేపీ గనుక అటు టీడీపీ ఇటు జనసేనతో పొత్తుకు రాంరాం చెప్తే అప్పుడు కామినేని శ్రీనివాస్ గోడ దూకుతారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో తనదైన ముద్ర కనబడేలా కామినేని శ్రీనివాస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కైకలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయంగా కాకరేపుతోంది. జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇరు పార్టీలతో మీటింగ్ పెట్టడం గొప్పేమీ కాదు కానీ ఈ మీటింగ్‌లో టీడీపీ నేతలు సైతం ప్రత్యక్షం అవ్వడం కలవరం రేపుతోంది. పవన్ కల్యాణ్ చేపట్టబోయే వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో ఇప్పటి వరకు పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ జెండా కనుచూపు మేరలో ఎక్కడా కనబడలేదు. కానీ కైకలూరులో అందుకు భిన్నంగా బీజేపీ జెండాలు కనిపించేలా కామినేని శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 6న పవన్ కల్యాణ్ కైకలూరులో వారాహి విజయయాత్రకు రానున్నారు. ఈ యాత్రలో అన్నీ తానై వ్యవహరించి మంచి మార్కులు కొట్టేయడంతోపాటు తన పొలిటికల్ ఫ్యూచర్‌కు మరింత పదును పెట్టాలని కామినేని శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కామినేని ఆశలు ఫలిస్తాయా? ఆయన బీజేపీలోనే ఉంటారా? జనసేనలోకి జంప్ అవుతారా అనేవి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : పొత్తు గురించి విమర్శలు చేయొద్దు.. జనసైనికులకు నాగబాబు వార్నింగ్