TTD:ఈవో నివేదిక కీలకం.. ధార్మిక పెద్దలతో నేడు సీఎం భేటీ

by Jakkula Mamatha |
TTD:ఈవో నివేదిక కీలకం.. ధార్మిక పెద్దలతో నేడు సీఎం భేటీ
X

దిశ, డైనమిక్​ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం లోని లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఈవో నివేదిక కీలకం కానుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఈవోను ఆదేశించింది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబును కలిసి నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత చర్యలు చేపడతారు. అయితే ఇప్పటికే ఈవో శ్యామలరావు నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమే అని తేల్చి చెప్పారు. జంతు కొవ్వు వాడుతున్నారని అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

దీనిలో పాత్రధారులు ఎవరో నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది. కాగా ఈ రోజు ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్​ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. వారి సూచనల మేరకు ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు, స్వామీజీలు పెదపులిపాకలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. శ్రీవారి సన్నిధిలో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని కోరారు. ఏ ప్రసాదంలో ఏ పదార్థం కలిసిందో అని అనుమానాలు భక్తులకు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్​ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed