వైసీపీలో మండలి కుదుపు..టీడీపీ శ్రేణుల్లో పెరిగిన జోష్

by samatah |
వైసీపీలో మండలి కుదుపు..టీడీపీ శ్రేణుల్లో పెరిగిన జోష్
X

అధికార వైసీపీని శాసనమండలి ఎన్నికలు కుదిపేస్తున్నాయి. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఘన భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అనుకున్న అంచనాలు తప్పాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల కౌంటింగ్ లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వైసీపీ మద్దతిచ్చిన ఉపాధ్యాయ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి కొద్దిపాటి మెజార్టీతో బయటపడగా, పట్టభద్ర స్థానంలో ఉన్న వెన్నపూస రవీంద్రారెడ్డికి గట్టి పోటీ ఎదరవుతోంది. ఈ పరిణామాలు వైసీపీని ఆత్మరక్షణలో పడేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీలో జోష్ పెరిగింది.

దిశ, కడప: వైసీపీ ఆవిర్భావం నుంచి కడప జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలో సత్తా చాటుతూ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ మినహా మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయం సాధించింది.రాయలసీమ విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. మొత్తమ్మీద రెండు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీని వైసీపీ గట్టి దెబ్బ కొట్టిన తరుణంలో ఈ పశ్చిమ రాయలసీమ వైసీపీ ఎన్నికల్లో కుదేలైపోయింది.

169 ఓట్ల తేడాతోనే గెలుపు..

ఉపాధ్యాయ మండలి స్థానం నుంచి వైసీపీ మద్దతు అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీ రామచంద్రారెడ్డి కేవలం 169 ఓట్లతో విజయం సాధించారు. అయితే ఇది ఆ పార్టీలో విజయానందాన్ని నింపలేకపోయింది. గెలుపే ధ్యేయంగా వైసీపీ శ్రేణులు పని చేశాయి. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించారు. ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ చేసి కూడా ఇంత తక్కువ మెజార్టీతో గెలుపొందడంపై ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుంది. సమీప అభ్యర్థి ఒంటే శ్రీనివాసరెడ్డికి 10,618 ఓట్లు రాగా, రామచంద్రారెడ్డికి 10787 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు ఆయన గెలుపును ప్రకటిస్తూ ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు

ఉత్కంఠతగా పట్టభద్రుల కౌంటింగ్

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల పోరు హోరా‌హారాగా మారింది. కౌంటింగ్ 8వ రౌండ్ పూర్తయ్యింది. ఇంకా 60 వేల ఓట్లకు లెక్కించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న మెజార్టీ పరిశీలిస్తే టీడీపీ మద్దతుదారుడు భూమిడి రాంగోపాల్ రెడ్డికి 73,229 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి 74,678 ఓట్లు వచ్చాయి. అంటే వీరి మధ్య 1,441 ఓట్లు తేడా‌మాత్రమే కనిపిస్తోంది.

Next Story

Most Viewed