రోజాపై వ్యాఖ్యల ఎఫెక్ట్: మాజీమంత్రి బండారు ఇంటికి పోలీసులు..ఉద్రిక్తత

by Seetharam |
రోజాపై వ్యాఖ్యల ఎఫెక్ట్: మాజీమంత్రి బండారు ఇంటికి పోలీసులు..ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద ఆదివారం రాత్రి నుంచి పోలీసులు మోహరించారు. అయితే సత్యమేవ జయతే దీక్షలో భాగంగా బండారు సత్యనారాయణ మూర్తి సోమవారం దీక్షలో పాల్గొన్నారు. అయితే అనారోగ్యంగా ఉండటంతో పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్న బండారుకు వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను తీసుకువచ్చారు. అయితే అంబులెన్స్‌ను లోపలకు పంపేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణతోపాటు ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నోటీసులు పట్టుకొని గుంటూరు నుంచి పోలీసులు బండారు నివాసానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహంతో రెచ్చిపోయారు.‘పోలీస్‌ గోబ్యాక్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెుత్తానికి అతి కష్టం మీద గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు బండారు ఇంట్లోకి చేరుకున్నారు. వైద్య పరీక్షలు గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉందని వైద్యులు తెలియజేయడంతో పోలీసులు వేచి చూస్తున్నారు. ఏ క్షణమైనా బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా నగరం పాలెం పీఎస్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బండారును అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఇంటి ఎదుట నిరసనలకు దిగారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్తితి నెలకొంది.

నగరంపాలెంలో కేసు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాను అసభ్య పదజాలంతో దూషించారనే గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస స్టేషన్‌లో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు అయ్యింది. బండారు సత్యనారాయణ మూర్తిపై న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. దీంతో నగరపాలెం పోలీసులు బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్‌ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్‌ 67 కింద కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే బండారు సత్యనారాయణ మూర్తిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు లేఖసైతం రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక తరలి వచ్చారు. అప్పటి నుంచి అక్కడే మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులపై బండారు సతీమణి ఫిర్యాదు

ఇదిలా ఉంటే పోలీసులపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ నోటీసూ ఇవ్వకుండా ఆదివారం రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story