దొంగ ఓట్లతో గెలిచానన్న ఎమ్మెల్యే రాపాక.. రంగంలోకి దిగిన ఈసీ

by Mahesh |
దొంగ ఓట్లతో గెలిచానన్న ఎమ్మెల్యే రాపాక.. రంగంలోకి దిగిన ఈసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అందుకే నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందులోనూ ప్రజా జీవితంలో అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయితే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే నోరును పొదుపుగా వాడాలి అని అంటుంటారు. ఒకవేళ టంగ్ స్లిప్ అయితే వారు చిక్కుల్లో పడక తప్పదు. అలాంటి పరిస్థితి డా.బి.ఆర్.అంబేడ్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గ శాసనసభ్యుడు రాపాక వర ప్రసాద్‌కు అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.

ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లు కూడా దోహదపడ్డాయని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఊరు చింతలమోరికి ఓ దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని, 15 నుంచి 20 మంది వరకు తలా 5 నుంచి 10 ఓట్లు వేసేవారని, తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందంటూ బాంబు పేల్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే సఖినేటిపల్లికి చెందిన యెనుముల వెంకటపతి రాజు అనే వ్యక్తి ఈ మెయిల్ ద్వారా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.

దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఎన్నికపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యాలంటూ టీడీపీ తనను సంప్రదించింది అని ఆరోపించారు. అయితే తాము అలాంటి ప్రయత్నాలు చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. మెుత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed