Kakinada: రూ. 40 వేల కోసం అడ్డంగా బుక్కైన ఏఈ

by srinivas |
Kakinada: రూ. 40 వేల కోసం అడ్డంగా బుక్కైన ఏఈ
X

దిశ‌, కాకినాడ: అవినీతి నిరోధ‌క శాఖ‌కు ఓ భారీ తిమింగ‌ళం ప‌ట్టుబ‌డింది. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో ఇంజ‌నీరింగ్ విభాగంలో ప‌ని చేస్తున్న ఏఈ వంశీ అభిషేక్ రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపులను ఆన్‌లైన్ చేయాలంటే లంచం డిమాండ్ చేసిన ఏఈ ఆ న‌గ‌దు తీసుకుంటుండ‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

పిఠాపురం మున్సిపాల్టీలో ఇంజ‌నీరింగ్ విభాగంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నాం ఇంజ‌నీరింగ్ విభాగంలో ప‌ని చేస్తున్న ఏఈ వంశీ అభిషేక్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ప‌ట్టణానికి చెందిన సూర‌వ‌ర‌పు సత్తిరాజు అలియాస్ దివాణం అనే కాంట్రాక్టరు ఓ పార్కులో అభివృద్ధి ప‌నులు చేశారు. సుమారు 6 ల‌క్షల రూపాయాలు నిధులు రావాల్సి ఉంది. అయితే ఆ బిల్లులు చెల్లించాలంటే వాటిని ఆన్‌లైన్ చేయాలి. నెల‌లు త‌ర‌బ‌డి ఏఈ వంశీ అభిషేక్ బిల్లులు ఆన్‌లైన్ చేయ‌కుండా త‌ప్పించుకుంటున్నారు. ఇందుకు 10 శాతం క‌మిష‌న్ అడిగాడ‌ని బాధితుడు దివాణం చెబుతున్నారు. చేసేది లేక రూ.40 వేలు డ‌బ్బుల ఇస్తాన‌ని బేరం కుదుర్చుకున్నారు. అనంత‌రం ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నాం ఏసీబీ రాజ‌మండ్రి అడిష‌న‌ల్ ఏస్పీ సౌజ‌న్య ఆధ్వర్యంలో లంచం తీసుకుంటుండగా ఏఈ వంశీ అభిషేక్‌ను ప‌ట్టుకున్నారు. అనంత‌రం విచారించారు. ఏఈ వంశీ అభిషేక్ ఉద్యోగంలో చేరిన‌ప్పటి నుండి ఇక్కడే ప‌ని చేస్తున్నారు. ఇంజ‌నీరింగ్ విభాగంలో అవినీతి అక్రమాలు జ‌రుగుతున్నాయ‌ని వ‌రుస‌గా ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదులు అంద‌డం, తాజాగా కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించ‌డంతో పిఠాపురం మున్సిపాల్టీ మ‌రోసారి వార్తల్లోకెక్కింది.


రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికాడు..

మున్సిప‌ల్ ఏఈ వంశీ అభిషేక్ ఏసీబీకి రెడ్ హ్యాండ్‌డ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. దివాణం అనే కాంట్రాక్ట‌ర్ నుండి లంచం డిమాండ్ చేశాడు. ఆయ‌న ఏసీబీని ఆశ్రయించ‌డంతో వ‌ల‌పన్ని ప‌ట్టుకున్నాం. ఎవ‌రైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించ‌వ‌చ్చు. పిఠాపురంలో ఇంజ‌నీరింగ్ విభాగంలో అక్రమాల‌పై లోతైన విచార‌ణ చేస్తాం.

- సౌజ‌న్య, అడిష‌న‌ల్ ఏస్పీ, ఏసీబీ


నర‌కం చూపించాడు..

మేము అప్పులు చేసి ప‌నులు చేస్తున్నాం. బిల్లులు చేయాలంటే వీరికి లంచాలు ఇవ్వనిదే ప‌ని జ‌ర‌గ‌దు. ఏఈ వంశీ అభిషేక్ న‌ర‌కం చూపించాడు. ఎన్నిసార్లు అడిగినా బిల్లులో 10 శాతం ఇవ్వనిదే బిల్లులు అప్‌లోడ్ చేయ‌న‌న్నాడు. న‌గ‌లు తాక‌ట్టు పెట్టి లంచాలు ఇస్తున్నాం. అందుకే ఏం చేయాలో తెలియ‌క ఏసీబీని ఆశ్రయించా.

- సూర‌వ‌ర‌పు దివాణం, కాంట్రాక్టర్‌

Advertisement

Next Story

Most Viewed