Duvvada Srinivas: వైసీపీకి తలనొప్పిగా మారిన నాయకుల కుటుంబ కలహాలు

by Ramesh Goud |
Duvvada Srinivas: వైసీపీకి తలనొప్పిగా మారిన నాయకుల కుటుంబ కలహాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మరో తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఘోర పరాభవం చవి చూసిన వైసీపీకి సోంత పార్టీ నాయకుల వివాదాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఒకవైపు ఎన్నికల్లో కేవలం 11 సీట్లు నెగ్గి అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నారన్న వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉండగా జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణకు రావడంతో.. జగన్ జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే పార్టీ నేతలు యాక్టివ్ గా లేరని, ఇక అధినేత జైలుకు వెళ్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అక్రమాలను తవ్వి తీస్తుండటంతో వైసీపి నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. గతంలో వైసీపీకి ఫుల్ సపోర్ట్ గా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రస్తుత పరిస్థితుల దృష్యా పూర్తిగా దూరం పెట్టింది. ఇన్ని సమస్యల మధ్య సతమతమవుతున్న వైసీపీకి, సొంత పార్టీ నాయకుల కుటుంబ కలహాలు మరో తలనొప్పిగా మారాయి.

ఇటీవల కాలంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషన్ శాంతి వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. భర్త విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని, దానికి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని ఆమె భర్తే ఆరోపణలు చేశారు. దీంతో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఆరోపణలు రావడంతో వైసీపి ప్రతిష్టకు భంగం కలిగినట్టు అయ్యింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయట పడుతున్నామని అనుకునే లోపే మరో వివాదం ముందుకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గత కొద్ది కాలంగా కుటుంబానికి దూరంగా వేరే మహిళతో ఉంటున్నారు. ఇటీవల ఆ వివాదం కాస్త ముదురుతోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వివాదమే బర్నింగ్ ఇష్యూగా మారింది. మొన్న దువ్వాడ కుతూళ్లు తండ్రిని చూడాలి.. మాట్లాడాలి అని ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకి వెళ్లగా.. నిన్న రాత్రి దువ్వాడ భార్య వాణి, కుతూళ్లతో కలిసి ఆయన నివాసం వద్ద నిరసనకు దిగారు.

దీంతో శ్రీనివాస్ భార్య పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతో కొట్టే ప్రయత్నం చేశారు. నన్ను రోడ్డుకి ఈడుస్తావా అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై దాడి చేయబోయారు. దీంతో వైసీపీ నాయకులపైనే కాకుండా పార్టీపై కూడా తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీలో ఇలాంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడా అని ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. గతంలో టీడీపీ, జనసేన నాయకుల కుటుంబాలపై ఆరోపణలు చేసిన జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. ఈ వివాదాలు వైసీపీ అధినేత జగన్ ను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఎటు ముందడుగు వేద్దామన్న పార్టీకి మరింత మైనస్ అయ్యేలా ఉందని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story