లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్..ఆ తర్వాత వెడ్డింగే: లోకేశ్‌కు సీఐడీ నోటీసులపై మాజీమంత్రి పేర్ని నాని

by Seetharam |
లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్..ఆ తర్వాత వెడ్డింగే: లోకేశ్‌కు సీఐడీ నోటీసులపై మాజీమంత్రి పేర్ని నాని
X

దిశ , డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై మాజీమంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్ ఉంటుందంటూ చమత్కరించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేశ్‌కు శనివారం సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని లవ్ లెటర్‌తో పోల్చారు. అక్కడితో ఆగిపోలేదు లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్ ఉంటుందని ఆ తర్వాత ఇంకేముంటుందని వెడ్డింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైల్లో ఉంటే లోకేశ్ ఢిల్లీ ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. వెళ్తూ వెళ్తూ టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసులు ఉంటే ఢిల్లీలో న్యాయవాదుల చుట్టూ లోకేశ్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. లోకేశ్‌కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధమవ్వాలి అని సవాల్ విసిరారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దాం అని ఛాలెంజ్ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? అని మరోసారి సవాల్ విసిరారు. ఇకపోతే ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరణకు గురైంది. అయితే లోకేశ్‌కు 41 ఏ సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి విచారణ చేయాలని...లోకేశ్‌ కూడా విచారణకు సహకరించాలని ఏపీ సీఐడీ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 30న సీఐడీ లోకేశ్‌కు నోటీసులు సైతం ఇచ్చింది. ఈనెల 4న విచారణకు హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం లోకేశ్ ఢిల్లీ పర్యటన చేపట్టారు.న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story