జలయజ్ఞం@ 20,000 కోట్లు

by samatah |
జలయజ్ఞం@ 20,000 కోట్లు
X

కరువు కడపలో బీడు భూములను సస్యశ్యామలం చేసేలా, కరువు కాటకాలకు కాలం చెల్లేలా జిల్లాలో సాగునీటి పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పరుగులు తీసిన జలయజ్ఞం ఆ తర్వాత అరకొర పనులు తప్ప ముందుకు సాగలేదు. జిల్లాకు శాశ్వత కరవు నివారణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈనెల 16న ప్రవేశపెట్టిన రాష్ర్ట బడ్జెట్‌లో కూడా ఆశించినంత కాక పోయినా కొంత ప్రాధాన్యత లభించింది. వైఎస్ హయాంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల పనులతో పలు రిజర్వాయర్లు, వరద కాలువలు పూర్తి కావడంతో జిల్లాలో 84 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు వున్నాయి. వీటికి తోడు ప్రస్తుతం జరుగుతున్న పెండింగ్ ప్రాజెక్టు పనులు, కాలువల నిర్మాణం, గండికోట ప్రాజెక్టు టన్నెల్, దాని వరద కాలువల విస్తరణ, సామర్థ్యం పెంచడం లాంటి పనులు పూర్తి అయితే కడప జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు రాష్ర్టంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి.

దిశ, కడప ప్రతినిధి: కడప జిల్లాలో సుమారు రూ.20 వేల కోట్ల అంచనాతో సాగునీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే రూ.8 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. రాష్ర్టంలోని ప్రాజెక్టుల్లో ప్రధానమైన గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు, వాటి అనుసంధాన పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తదితర పనులు పురోగతిలో వున్నాయి. వీటిలో వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చేపట్టి పెండింగ్‌లో వున్న పనులు కొన్ని అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని వున్నాయి. జిల్లాలో పనులు జరుగుతున్న నీటి ప్రాజెక్టుల్లో గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు పనులు రూ.4,300 కోట్లతో జరుగుతున్నాయి. అలాగే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు (సిబిఆర్) రూ.900 కోట్లతో పురోగతిలో వున్నాయి. వీటితో పాటు మైక్రో ఇరిగేషన్ క్రింద పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పి.బి.సి), గండికోట లిఫ్ట్ ఇరిగేషన్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూ.1100 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అలాగే అలవలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రూ.52 కోట్లతో చేపట్టారు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం క్రింద జి.ఎన్.ఎస్.ఎస్ కాలువ 0-66 కిలోమీటర్ల వరకు అప్ గ్రేడేషన్ పనులు రూ.300 కోట్లతో జరుగుతున్నాయి. రెండవ ప్యాకేజీలో 66వ కిలోమీటర్ నుంచి 96వ కిలో మీటర్ వరకు రూ.325 కోట్లతో పనులు చేపట్టారు. గండికోట, సీబీఆర్, పైడి పాళెం అప్ గ్రేడేషన్ పనులు రూ.2,600 కోట్లతో జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్, స్టక్చర్స్ పనులకు సంబంధించి, గాలేరు నగరి కెనాల్ 34 కిలోమీటర్ల నుంచి 66వ కిలోమీటర్ వరకు రూ.372 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో సాగుతున్నాయి. వీటితో పాటు గాలేరు నగరి, హంద్రీ నీవా అనుసంధాన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రూ.1500 కోట్లతో జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఔకు నుంచి గండికోట ప్రాజెక్టు వరకు టన్నెలు పనులు, కొంత మేరకు వరద కాలువ పనులు కలిపి రూ.4 వేల కోట్లతో చేపట్టారు. ఇలాంటి ప్రధాన పనులతో పాటు ఇప్పటికే పూర్తి కావచ్చిన తెలుగుగంగ ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలో పునర్ నిర్మించాల్సి వున్న అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు, ప్రాజెక్టులు పూర్తి అయి కాలువలు లేని ఝరికోన, వెలిగల్లు తదితర ప్రాజెక్టులు కలిపి సుమారు రూ.20 వేలకోట్లతో పనులు జరుగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.

-బడ్జెట్ కేటాయింపులతో మరింత వేగం

జిల్లాలోని సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పనుల కోసం అనుకున్న మేరకు కాక పోయినా బడ్జెట్ లో కొంత ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో పురోగతిలో వున్న ప్రాజెక్టులతో పాటు పునర్ నిర్మించాల్సిన అన్నమయ్య ప్రాజెక్టుతో కలిపి 2023 -2024 ఆర్థిక సంవత్సరానికి రూ.5,222 కోట్లు నిధులు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం బడ్జెట్‌లో అన్నమయ్య ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో స్పష్టత లేదు కానీ, మిగిలిన వాటి కోసం రూ.1500 కోట్లు కేటాయించింది. ఇందులో గాలేరు నగరికి రూ.855 కోట్లు కేటాయించడంతో పాటు హంద్రీనీవాకు రూ.122.69 కోట్లు కేటాయించారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులకు రూ.225 కోట్లు కేటాయించారు. తెలుగుగంగకు రూ.232 కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు రూ.106 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులు మరింత పురోగతిలో నడిచే అవకాశాలు వున్నాయి

Advertisement

Next Story

Most Viewed