విజయవాడ వెస్ట్ పై వీడని సంక్షోభం.. టికెట్ వారికేనా..?

by Ramesh Goud |
విజయవాడ వెస్ట్ పై వీడని సంక్షోభం.. టికెట్ వారికేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో పొత్తులతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ జనసేన పార్టీలకు వరుస చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో సీటు దక్కని కొందరు ఆశావాహులు పార్టీని వీడుతుండగా, మరికొందరు టికెట్ పై పునరాలోచించాలని అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఇక రెండో జాబితా విడుదలపై తీవ్ర కసరత్తులు చేస్తొన్న పొత్తు పార్టీలకు ఇంకెన్ని కొత్త చిక్కులు వచ్చి పడతాయోనని అయోమయంలో ఉన్నారు. ఇంకా ప్రకటించని వాటిలో ఉన్న స్థానం విజయవాడ పశ్చిమం కూడా ఒకటి. అయితే ఈ స్థానం అటు టీడీపీ నుంచి మాజీ మంత్రి బుద్దా వెంకన్న సీటు ఆశిస్తుండగా, ఇటు జనసేన నుంచి పోతిన మహేష్ టికెట్ తనకే దక్కుతుందని పూర్తి ధీమాతో ఉన్నారు.

ఇప్పటికే ఇరు పార్టీల నేతలు నియోజకవర్గంలో కలియ తిరుగుతూ.. విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేన ఇన్ చార్జి పోతిన మహేష్ మా బలం, బలగం ఏంటో తెలుసని, సీటు తనకే కన్ఫామ్ అయ్యిందని, పవన్ కళ్యాణ్ ప్రకటించడమే మిగిలి ఉందని చెబుతూ.. కార్యకర్తలు ఎవరూ సోషల్ మీడియాలో టీడీపీపై పోస్టులు పెట్టవద్దని నిర్ధేశం చేశారు. ఇక టీడీపీ నేత బుద్దా వెంకన్న నియోజకవర్గమంతా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చెబుతూనే.. సీటు దక్కకపోయినా చంద్రబాబు వెంటే ఉంటానని, చంద్రబాబు నాకు దైవసమానులని చెబుతున్నారు. దీంతో విజయవాడ వెస్ట్ స్థానం ఎవరిని వరిస్తుందో అనేది చర్చనీయాంశంగా అయ్యింది.

ఇక పోతిన మహేష్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ.. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి 15 శాతం ఓట్లు సంపాదించారు. దీంతో ఈ సారి ఖచ్చితంగా విజయవాడ పశ్చిమం నుంచి గెలుపు తనదేనని చెప్పుకుంటున్నారు. బుద్దా వెంకన్న విషయానికి వస్తే టీడీపీలో మాజీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉంటూ.. గుర్తింపు పొందిన నేతగా పేరు పొందారు. టీడీపీ అధిష్టానం టికెట్ తనకే కేటాయిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే రెండు స్థానాలు ప్రకటించగా విజయవాడ వెస్ట్, అవనిగడ్డ మిగిలిఉన్నాయి. విజయవాడ సెంట్రల్, తూర్పు స్థానాలు టీడీపీకి కేటాయించగా, వెస్ట్ జనసేనకే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్ని వివాదాల నడుమ విజయవాడ వెస్ట్ సీటుపై పొత్తు పార్టీలు ఏం నిర్ణయం తీసుకుంటాయో అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story