టీడీపీకి సంక్షోభం: సుప్రీంలో తేడా కొడితే చంద్రబాబు ఇప్పట్లో బయటకు రానట్టే?

by Seetharam |   ( Updated:2023-10-19 11:16:27.0  )
టీడీపీకి సంక్షోభం: సుప్రీంలో తేడా కొడితే చంద్రబాబు ఇప్పట్లో బయటకు రానట్టే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసు నుంచి ఇప్పట్లో బయటకు రాలేరా? మరికొన్ని నెలలు జైలు జీవితం గడపాల్సిందేనా? చంద్రబాబు డిసెంబర్ వరకు జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ లేనట్లేనా? ఈ స్కిల్ స్కాం కేసులో విచారణ వరుస వాయిదాలు పడటం...బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవ్వడంతో మరింత కాలం చంద్రబాబు జైల్లోనే ఉంటారనే ప్రచారంలో వాస్తవముందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. దాదాపు 41 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ స్కిల్ స్కాం కేసులో బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాల్లో ఒకసారి బెయిల్ పిటిషన్లు కొట్టేసినా మరోసారి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లపై విచారణ వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం వెలువడనుంది. ఇలా చంద్రబాబు నాయుడుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందంటూ ప్రచారం జరుగుతుండటం వారిలో మరింత ఆందోళనకు కారణమవుతుంది. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత టీడీపీ బాబుతో నేను అనేకార్యక్రమం మినహా ఇతర కార్యక్రమాలు ఏమీ చేపట్టడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నేతలు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారు. అటు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సైతం బ్రేక్‌లు పడ్డాయి. ఇలానే ఉంటే ప్రజల్లో టీడీపీపై సానుభూతి కాదు కదా ఉన్న అభిమానం కూడా పోతుందని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో తమ పార్టీ భవిష్యత్ అందకారంలోకి వెళ్లినట్లైపోయిందని ఆందోళన చెందుతున్నారు.

చంద్రబాబు లోటు కొట్టొచ్చినట్లు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది.సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని అలాంటి వాటిని సవాలక్ష ఎదుర్కొంది అని టీడీపీ బాహటంగా చెప్తోంది. కానీ అదంతా చంద్రబాబు బయట ఉన్నప్పుడు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఆ పార్టీకి పెద్ద సంక్షోభంగానే పరిగణించాలి. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత టీడీపీలో స్తబ్ధత నెలకొంది. చంద్రబాబు నాయుడు 41 రోజులుగా జైల్లో గడుపుతున్నారు. ఈ 41 రోజులుగా టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం చాలా అరుదు అనే చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు బయట ఉంటే గనుక ఇప్పటికే ఎన్నికల కాంపైన్ ప్రారంభించేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి ప్రజల్లో విపరీతంగా వచ్చింది. ఇదే విషయాన్ని అనేక సర్వేలు సైతం ధృవీకరించాయి.కానీ వాటిని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ నాయకత్వం విఫలమైంది అనే చెప్పాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయనిపుణులతో సంప్రదింపులు అంటూ ఢిల్లీకే పరిమితమయ్యారు. మిగిలిన చోటామోటా నాయకులు ప్రెస్‌మీట్లు లేదా పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యారు. ఒకవైపు వైసీపీ ప్రజల్లోకి దూసుకుపోతుంది. కానీ టీడీపీ మాత్రం అలా మిన్నకుండిపోయింది. కేవలం బాబుతో నేను అనే కార్యక్రమాన్ని మాత్రం నిర్వహిస్తోంది. ఇది ఇంకెన్నాళ్లు అని ఆ పార్టీ శ్రేణులో అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజలకు అందరికీ తెలిసిపోయిందని దాన్ని ఖండించడం ఎంతముఖ్యమో పార్టీని బతికించుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబుపై అక్రమ కేసులు, టీడీపీ నేతలపై కక్షసాధింపు రాజకీయాలను ప్రజలకు వివరిస్తే టీడీపీ పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మెుత్తానికి చంద్రబాబు బయట లేకపోతే ఎంత వెలితో అన్నది టీడీపీ శ్రేణులకు తెలిసి వచ్చింది.

డిసెంబర్ వరకు కష్టమేనా?

చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో బెయిల్‌పై బయటకు తీసుకువచ్చేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. చివరికి రాష్ట్రపతిని కలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సైతం కలిసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బెయిల్ మాత్రం రావడం లేదు. విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఏపీ హైకోర్టులోనూ సేమ్ సీన్. కానీ మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు..దానిపై విచారణ వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇకపోతే సుప్రీంకోర్టులో శుక్రవారం తీర్పు వెల్లడికాబోతుంది. ఈ తీర్పుపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ తీర్పు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా రాకపోతే బెయిల్ ఇప్పట్లో కష్టమేననే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆరు నెలల వరకు చంద్రబాబుకు బెయిల్ రాదని చెప్తున్నారు.మరోవైపు చంద్రబాబు కేసును మాజీ కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరం కేసుతో పోలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పేరుతో చిదంబరాన్ని జైల్లో పెట్టింది. దాదాపు చిదంబరం 105 రోజులపాటు జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ చిదంబరం అవినీతి కేవలం లక్షలాది రూపాయలు మాత్రమే. కానీ చంద్రబాబు రూ.371 కోట్లు. ఆ కేసుప్రకారం ఆలోచిస్తే చంద్రబాబు ఖచ్చితంగా డిసెంబర్‌ వరకు బయటకు రానట్లేనా అన్న సందేహం కలుగుతుంది.

బాలయ్యే దిక్కు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఉపశమనం కలగకపోతే ఇక బయటకు వచ్చేది డిసెంబర్‌లోనేనని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్‌లో బయటకు వస్తే మరి తెలంగాణలో ఎన్నికల పరిస్థితిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కూడా పోటీ చేసేందుకు టీడీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చంద్రబాబు బయట లేకపోవడంతో వారి గెలుపునకు దిశానిర్దేశం చేసేది ఎవరనే చర్చ జరుగుతుంది. నవంబర్‌లో ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అంటే చంద్రబాబు బయటకు వచ్చేలోపు ఎన్నికల ప్రక్రియ మెుత్తం క్లోజ్ అయిపోతుంది. దీంతో తెలంగాణ ఎన్నికల బాధ్యతలు నందమూరి బాలకృష్ణకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యే దిక్కు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవలే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో బాలయ్య ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కాస్త ధైర్యం వచ్చినట్లైంది. తెలంగాణలో బాలయ్యతో నెట్టుకువచ్చినా ఏపీలో మాత్రం అది అంత సాధ్యం కాని పని. కాబట్టి ఇప్పటి నుంచే నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రజల్లోకి వెళ్తేనే కానీ టీడీపీకి పూర్వవైభవం రాని పరిస్థితి లేకపోతే...టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలో ఇదొక సంక్షోభంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story