ఆదుకోకపోతే దిగిపోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం

by Javid Pasha |
ఆదుకోకపోతే దిగిపోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితుల పోరుకేక సీపీఎం మహా పాదయాత్ర గురువారం 10వ రోజుకు చేరుకుంది. అంతేకాదు ఈ మహాపాదయాత్ర 200కిలోమీటర్లు పూర్తి చేసుకుని బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం చేరుకుంది.ఈ సందర్భంగా రెడ్డి గణపవరంలో ఏర్పాటు చేసిన సభలో వి శ్రీనివాసరావు నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు. పునరావాస కేంద్రాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించకుండా.. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా నిర్వాసితులను బలవంతంగా తరలించడం దుర్మార్గమని అన్నారు. మహా పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో నిర్వాసితులు తమ కష్టాలు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు, విద్యుత్, రోడ్డు, డ్రైనేజీ, కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న నిర్వాసితులకు కనీస చిరునామా కూడా కరువైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు.కొందరి నిర్వాసితులు పునరావాస కాలనీలకు వచ్చినప్పటికీ వారి చిరునామా గతంలో నివాసం ఉన్న గ్రామ చిరునామా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన ప్రతి పైసా ముందుగా నిర్వాసితులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూమికి భూమి, పరిహారం నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు సక్రమంగా కల్పించకపోతే తిరిగి గోదావరి గ్రామాలకు వెళ్ళిపోతామని నిర్వాసితులు చెప్పడం ప్రభుత్వాలకు చెంపపెట్టు అని అన్నారు. నిర్వాసిత సమస్యలను వెల్లడి చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు రద్దు చేస్తామని నీచమైన బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 జిల్లాల ప్రజలకు మేలు చేయడానికి ఒక లక్ష 30 వేల మంది నిర్వాసితులు సర్వం కోల్పోయారని చెప్పుకొచ్చారు. గత ఏడాది గోదావరి వరదలకు 196 గ్రామాలు మునిగిపోతే కేవలం 36 గ్రామాలకి వరద ముంపు ఉందని ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోసం సీపీఎం చేపట్టినఈ పోరుకేక మహాపాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. జూలై 4న నిర్వాసితుల సమస్యలపై విజయవాడకు నిర్వాసితులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story