సినిమా టికెట్ల పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన.. స్పందించిన సీపీఐ నేత

by Jakkula Mamatha |
సినిమా టికెట్ల పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన.. స్పందించిన సీపీఐ నేత
X

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిస్తూ జీవోలు ఇవ్వటం పరిపాటిగా మారింది. ఇది ప్రేక్షకుల, ప్రజల జేబులను కొల్లగొట్టడమే. పెద్ద హీరోల సినిమాలు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ లతో, ఏళ్ల తరబడి చిత్రీకరణతో నిర్మించి, ఆయా సినిమాల కలెక్షన్ల కోసం టికెట్ ధరలను పెంచాల్సిందిగా నిర్మాణ సంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి.

సినిమా రంగానికి తలొగ్గి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టికెట్ల ధరలు విపరీతంగా పెంచేందుకు అనుమతిస్తున్నాయి. ఈ విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటీవల తెలంగాణలో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడటంతో తెలంగాణ మేల్కొంది. ఇకమీదట తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed