నంద్యాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్యే పోటీ

by Mahesh |   ( Updated:2024-03-21 03:52:48.0  )
నంద్యాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్యే పోటీ
X

దిశ ప్రతినిధి, కర్నూలు : నవనందుల కోటపై ఎవరు జెండా ఎగుర వేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సారి ఎన్నికలు ఇరువురికీ కీలకంగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఎన్నికలకు నెలన్నర సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచారాలతో అన్ని మండలాలు, గ్రామాల్లో తిరిగేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలను ఎక్కు పెడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి. వీరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

ఇది నంద్యాల పరిస్థితి..

నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2,67,645 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,30,278 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,37,273 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 94 మంది ఉన్నారు. ఈ నియోజక వర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,995 మంది అధికంగా ఉన్నారు. ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. వీరు గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటించిన నాటి నుంచి ప్రచారాలు ముమ్మరం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎన్ఎండీ ఫరూక్ రాజకీయంగా సీనియర్ నాయకులు. ఈయన మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు.

పార్టీ మనుగడ కోసం పని చేస్తూ వస్తున్నారు. ఈయన సేవలు గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో ఈయన 1985, 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగా, శాసనమండలి చైర్మన్ గా పని చేశారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆయన తండ్రి శిల్పా మోహన్ రెడ్డి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. అలాగే ఆయన చిన్నాన్న శిల్పా చక్రపాణి రెడ్డి ప్రస్తుతం శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇరువురు నేతలు గెలుపు తీరాలు చేరేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు.

తండ్రికి తోడుగా యువ నాయకుడు.. కుమారుడికి తోడుగా పెద్దాయన..

నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కు తోడుగా యువ నాయకుడైన ఆయన కుమారుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తోడుగా ఉంటే..ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తోడుగా ఆయన తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తోడుగా ఉన్నారు. వీరిరువురూ రాజకీయ వ్యూహాలకు పదునెట్టారు. ప్రచారాలతో ముందుకెళ్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజు పార్టీ కార్యాలయాలతో పాటు నివాసాల వద్ద కార్యకర్తలతో చర్చిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 70 వేల మంది ముస్లిం ఓటర్లున్నారు.

ఈ రాజకీయ జూదంలో ముస్లిం ఓటర్లు తమ సామాజిక వర్గానికి చెందిన ఫరూక్ కు అండగా నిలబడతారా ? లేక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు అండగా నిలబడతారా ? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రత్యేకించి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కు ప్లస్ గా మారారు. ఈయన వారితో కలిసి ప్రచారం చేసి టీడీపీ గెలుపు కోసం పని చేయాలని లోకేష్ దిశా నిర్దేశం చేయడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో టీడీపీకి మరింత బలాన్ని చూకూర్చినట్లైంది.

Read More..

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు

Advertisement

Next Story