వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బంపరాఫర్: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల రీ ఎంట్రీ

by Seetharam |
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బంపరాఫర్: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల రీ ఎంట్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేపట్టిన వైఎస్ షర్మిల అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో తెలంగాణలో ఉన్న క్యాడర్ కాస్త చేజారిపోయింది. ప్రస్తుతం వైఎస్ షర్మిల మాత్రమే పార్టీకి దిక్కైన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల భేషరతుగా మద్దతు ప్రకటించడం పోటీ చేసే విషయంలో తోకముడవడంతో ఆ రాష్ట్రంలో ఇక ఆమె రాజకీయానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తానుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె సమాధికి ఆమె గొయ్యి తవ్వుకున్నట్లు అయ్యిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఇంతలా నష్టపోయిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు కలిగి ఉండటం మాత్రం ప్లస్ అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ ఎన్నికల బాధ్యతను వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ షర్మిల ఏపీకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

స్టార్ కాంపైనర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భేషరతుగా మద్దతు ప్రకటించింది. అదే పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి వైఎస్ షర్మిల ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యహరించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్‌తోపాటు ఎన్నికల బాధ్యతలను కూడా అధిష్టానం ఆమెకు అప్పగించనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల కీలకం కాబోతున్నారని ఇప్పటికే పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


రాహుల్, ప్రియాంక సభల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సుడిగాలి పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగుత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాం గాంధీలు విరిగా పర్యటిస్తారని తెలుస్తోంది. విశాఖలో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనేనినాదంతో ప్రియాంక గాంధీ ... అమరావతిలో ప్రత్యేక హోదా హామీ, అమరావతి ఏకైక రాజధాని హామీతో రాహుల్ గాంధీ బహిరంగ సభలు నిర్వహించబనున్నట్లు తెలుస్తోంది. ఈ సభల నిర్వహణ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

షర్మిలకు కాంగ్రెస్ బంపరాఫర్

తెలంగాణలో తమ పార్టీకి వైఎస్ షర్మిల భేషరతుగా మద్దతు ప్రకటించి ఎన్నికల నుంచి తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమె త్యాగానికి ప్రతిఫలం కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు నెరపుతున్న వైఎస్ షర్మిల రాబోయే రోజుల్లో రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇందుకు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలాంటి వారు సైతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం వాస్తవమా లేక ఏంటి అనేది తెలియాలంటే అటు కాంగ్రెస్ లేదా ఇటు వైఎస్ షర్మిలలు వివరణ ఇవ్వాల్సింది.

Advertisement

Next Story