సింగిల్‌గానే పోటీకి సై.. ఎన్నికల వేళ ఆశావాహుల్లో పొత్తుల టెన్షన్!

by sudharani |   ( Updated:2023-08-10 05:52:50.0  )
సింగిల్‌గానే పోటీకి సై.. ఎన్నికల వేళ ఆశావాహుల్లో పొత్తుల టెన్షన్!
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో అధికార పక్షాన్ని చాలా సులువుగా ఓడించవచ్చని ఆయా పార్టీల పెద్దలు ఆలోచన చేస్తున్నారు. 2019లో పొత్తు లేకపోవడంతోనే వైసీపీకి అధికారంలోకి వ‌చ్చింద‌నే భావ‌న‌లో ఉన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో కొందరు జనసేన ఇన్చార్జిలు మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ పెద్దలతో తమ గోడు వెళ్లగక్కుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పలు సేవలు చేస్తూ, 2019 ఎన్నికల్లో లక్షలాది రూపాయ‌ల చేతి చమురు వదిలించుకొన్న ఇన్చార్జిలు మాత్రం ఈ సారి పోటీకి సై అంటున్నారు. పొత్తులో భాగంగా త‌మ సీటు టీడీపీకి ఇచ్చేస్తామంటే ఊరుకునేది లేద‌ని తెగేసి చెబుతున్నారు.

కొత్తపేటలో అంతర్మథ‌నం

కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీతో పొత్తు ఉన్నా సరే జనసేన అభ్యర్థికి కాకుండా ఇక్కడ సీటు టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యానందరావుకు ఇస్తారు. క‌చ్చితంగా సీటు ఆయ‌న‌కే దక్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక వేళ సత్యానందరావునకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవ‌కాశం ఉందంటున్నారు. అదే విధంగా ఇక్కడ సత్యానందరావు తమ్ముడు శ్రీనివాసరావుకు కూడా మంచి పట్టు ఉంది. ఈయ‌న 2019 ఎన్నికల్లో జ‌న‌సేన తర‌ఫున పోటీ చేశారు. వీరిద్దరూ గ‌త ఎన్నిక‌ల్లో లక్షలాది రూపాయ‌లు చేతి చమురు వదిలించుకొన్నారు. దీంతో రానున్న ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ముమ్మిడివరంలో ..

ముమ్మిడివరం టీడీపీ ఇన్చార్జి దాట్ల సుబ్బరాజుకు సీటు ఖరారు అనే పుకార్లు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ 2019 ఎన్నికలో తొలి సీటుగా ప్రకటించిన పితాని బాల‌కృష్ణ జనసేన ఇన్చార్జిగా ఉన్నారు. ఇక్కడ కూడా పితానికి సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. బీసీల కోటాలో పితానికి ముమ్మడివరంలో కుదరకపోయినా కనీసం ఏదో ఒక చోట సీటు ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో ఆయ‌న తిరుగుబావుటా ఎగరవేసే పరిస్థితి వస్తుంది. బాలకృష్ణ కూడా 2019 ఎన్నికల్లో పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అంతేగాక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొని బరిలో నిలబడ్డారు. సొమ్ములు కూడా గట్టిగా ఖర్చు చేశారు.

రాజానగరంలో..

రాజానగరంలో ఇటీవలే టీడీపీ ఇన్చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని నియ‌మించారు. వాస్తవానికి మొన్నటి దాకా ఇక్కడ ఇన్చార్జి లేరు. దీంతో పొత్తులో భాగంగా క‌చ్చితంగా జనసేన అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ చౌదరిని పార్టీ నియమించిన నాటి నుంచి చౌదరి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. జనంలో మమేకమ‌వుతున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటన విజయవంతం చేశారు. కమ్మ సామాజిక వర్గం నుంచి జిల్లాలో సీట్లు ఇవ్వాల్సి ఉన్నందున అందులో భాగంగా రాజానగరంలో టీడీపీ సీటు చౌదరికి అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా స్పీడుగా ఉన్నారు. పొత్తులో భాగంగా సీటు దక్కకపోతే బ‌ల‌రామ‌కృష్ణ ప్లాన్ ఏంటనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story