పవన్ కళ్యాణ్ ప్రకటనతో వైసీపీలో ఆందోళన.. 2014 రిజల్ట్స్ రిపీట్ అవుతాయా..?

by Javid Pasha |   ( Updated:2023-09-14 15:12:19.0  )
పవన్ కళ్యాణ్ ప్రకటనతో వైసీపీలో ఆందోళన.. 2014 రిజల్ట్స్ రిపీట్ అవుతాయా..?
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి అధికారికంగా రెండు పార్టీల పొత్తు ఉంటుందని ప్రకటన చేశారు. బీజేపీ కూడా తమతో కలిసిరావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుతో ఇవాళ పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. జైల్లో చంద్రబాబును పవన్ పరామర్శించారు. పవన్ వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా బాబును కలిశారు.

దాదాపు గంటపాటు చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కూడా పవన్ పరామర్శించారు. అలాగే లోకేష్, బాలకృష్ణలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటినుంచి టీడీపీ, జనసేన కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తాయని, కలిసి ముందుకెళ్తామని పవన్ స్పష్టం చేశారు. పవన్ ప్రకటనతో ఆ రెండు పార్టీల మధ్య బంధం బయటపడిందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.

పవన్ ప్రకటనతో ఏపీలోని రాజకీయ పరిణామాలు పూర్తిగా మారనున్నాయి. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ మద్దతు బాగా కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో.. 2014 ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయా? అనే విశ్లేషణలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితేనే బాగుంటుందనే అంశాన్ని టీడీపీ, పవన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ అంశం టీడీపీ అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ఏపీలో జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక ఉండదని, ఆ రెండు పార్టీలకు ఇది ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నాయి. జగన్‌ను ఓడించడమే లక్ష్యమని రెండు పార్టీలు ఒకే గొడుకు కిందకు వచ్చాయి. రెండు పార్టీలు కలవడం వల్ల ప్రజల్లో కూడా కాస్త సానుకూలత వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీలకు పొత్తు అవసరం. దీంతో పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు లాభం జరుగుతుంది తప్ప నష్టం ఉండదని అంటున్నారు. పవన్ ప్రకటన వైసీపీలో కూడా గుబులు పుట్టిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

More News : హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి నారా లోకేష్.. రాజమండ్రి నుంచే నేరుగా.

Advertisement

Next Story

Most Viewed