దివ్యాంగురాలి హత్యపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

by sudharani |   ( Updated:2023-02-17 09:54:33.0  )
దివ్యాంగురాలి హత్యపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తాడేపల్లి దివ్యాంగురాలు ఎస్తేర్ రాణి హత్యపై జాతీయ మహిళ కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత శుక్రవారం ఫిర్యాదు చేశారు. తాడేపల్లి క్రైం హబ్‌గా మారిపోయింది అని లేఖలో ఆరోపించారు. తాడేపల్లిలో సీఎం నివాసం, డీజీపీ ఆఫీసులు ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువయ్యింది అని ధ్వజమెత్తారు. డ్రగ్స్‌తో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.

'పోలీసుల ఉదాసిన వైఖరితో తాడేపల్లిలో గతంలో అనేక దారుణమైన సంఘటనలు జరిగాయి... ఫిబ్రవరి 12 న నిందితుడు దివ్యాంగురాలు ఎస్తేర్ రాణిని చిత్రహింసలకు గురిచేశాడు. భాధితురాలి తల్లి నిందితుడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతలోనే రాజు దివ్యాంగురాలిపై దాడిచేసి తలపై కత్తితో నరికాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే క్రమంలో దివ్యాంగురాలు మృతిచెందింది. నిందితుడు రాజు నేరచరిత్ర కలిగినవాడు. పోలీసుల ఉదాసీన వైఖరే దివ్యాంగురాలి హత్యకు కారణం' అని వంగలపూడి అనిత ఆరోపించారు. 'నిందితుడు రాజు డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ దందాపై అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దివ్యాంగురాలిని అత్యంత దారుణంగా హతమార్చిన రాజుపై కఠిన చర్యలు తీసుకోండి. ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ నిషేదం పై చర్యలు తీసుకునేలా కమిషన్ ఆదేశించండి. డ్రగ్స్ ప్రభావంతో మహిళలపై జరిగిన నేరాలపై సమగ్ర విచారణ చేయించండి. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఖూనీ చేస్తున్న కొందరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి. భాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోండి' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి: జగన్ అండతోనే ఇసుక మాఫియా చెలరేగుతోంది: అచ్చెన్నాయుడు

Advertisement

Next Story

Most Viewed