ఏపీలోనూ ఆపరేషన్ హైడ్రా.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2024-09-08 16:36:46.0  )
ఏపీలోనూ ఆపరేషన్ హైడ్రా.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్న ఆయన.. ఆపరేషన్ హైడ్రాపై ఫోకస్ పెట్టారు. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

కాగా తెలంగాణలో ఆపరేషన్ హైడ్రా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, కాలువ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా భవంతులను సైతం నేలమట్టం చేస్తున్నారు. దీంతో హైడ్రా ఆపరేషన్ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా చట్టాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ హైడ్రా కావాలంటూ ఇప్పటికే పలువురి నుంచి ప్రతిపాదనలు వినిపించాయి. వాగులు, వంకలు ఆక్రమణలకు గురై భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తుండటంతో ఆపరేషన్ హైడ్రాను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత ఆపరేషన్ హైడ్రాను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed