అపవిత్రం చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారు.. లడ్డూ కల్తీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2024-09-23 11:16:29.0  )
అపవిత్రం చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారు.. లడ్డూ కల్తీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు (Cm Chandrababu) మరోసారి స్పందించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో తిరుమలలో ఎన్నో అపవిత్రాలు చేశారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ప్రత్యేకత ఉందని, అలాంటి పుణ్యకేత్రాన్ని రాజకీయాలకు పునరావాసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి మహా ప్రసాదాన్ని ఏ పాలకుడు అపవిత్రం చేయలేదన్నారు. కానీ వైఎస్ జగన్ (Ys Jagan) పాలనలో వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) దర్శన టికెట్లను ఇష్టమొచ్చినట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తిరుమల (Tirumala)లో తన వాళ్లకు మాత్రమే జగన్ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. అన్యమతస్తులకు టీటీడీ బోర్డు (TTD Board)లో అవకాశం కల్పించారని మండిపడ్డారు. డెయిరీ పెట్టిన సంవత్సరానికే తన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

‘‘మూడేళ్లలో ఒక ఏడాది రూ. 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, కానీ జగన్ అవేవీ చూడకుండా కాంట్రాక్టు ఇచ్చారు. అనుభవం లేని వాళ్లకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారు. టెండర్లలో పాల్గొనాలంటే నెయ్యి సరఫరాలో 3 ఏళ్లు అనుభవం ఉండాలి. 08/05/2024లో కేజీ నెయ్యికి రూ. 319లకు టెండర్ ఇచ్చారు. ఎన్నికలు అయిన వెంటనే తిరుమల ప్రక్షాళనపై దృష్టి పెట్టాం. టీటీడీ ఈవోగా శ్యామలరావు (TTD EO Syamala Rao)ను నియమించాం. తిరుమల పవిత్రను కాపాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. కల్తీ పరీక్షలకోసం టీటీడీ వద్ద ఎలాంటి వ్యవస్థ లేదు. భయం, భక్తి, నమ్మకం ఆధారంగానే ఇప్పటివరకూ ప్రసాదాలు తయారు చేశారు. మంచి వాసనలు వెదజల్లాల్సిన లడ్డూ పేలవంగా పాచిపోయినట్టు కనిపించింది. లడ్డూ నాణ్యత లేదనేది ఎవరూ బయటపెట్టలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. తిరుమల స్వామివారికి అపచారం చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారు. క్షమించరాని నేరం చేశారు. వాళ్ల మాటలు వింటుంటే కడుపు రగిలిపోతోంది. తప్పు చేసి పశ్చాత్తాపం పడని వాళ్లను ఏం చేయాలి.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed