Pakistan: ఖైబర్ పఖ్తుంఖ్వా హింసలో 68 మంది మృతి.. కాల్పుల విరమణకు అధికారుల ప్రయత్నం

by vinod kumar |
Pakistan: ఖైబర్ పఖ్తుంఖ్వా హింసలో 68 మంది మృతి.. కాల్పుల విరమణకు అధికారుల ప్రయత్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రావిన్స్‌లోని కుర్రం (Kurram) జిల్లాలో గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న హింసాకాండలో 68 మంది మృతి చెందారు. మరో100 మందికి పైగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో షియా(Shiya), సున్నీ (Sunnee) వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతినిధి బృందం షియా సంఘం నాయకులతో సమావేశమైంది. కాల్పుల విరమణ కోసం ఏకాభిప్రాయం తీసుకురావడానికి వీరు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రభుత్వ ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కూడా దుండగులు కాల్పులు జరిపారని, అయితే అందరూ సురక్షితంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ సమాచార మంత్రి ముహమ్మద్ అలీ సైఫ్ (Mohammad alee saif) తెలిపారు. ఇరు వర్గాలు సానుకూలంగానే స్పందించినట్టు వెల్లడించారు. కాగా, కుర్రం జిల్లాలో 50కి పైగా ప్యాసింజర్ వాహనాలపై ఇటీవల ఉగ్రవాదులు కాల్పులు జరపగా పలు వాహనాలు దెబ్బతినడంతో పాటు 40 మంది మరణించారు. అయితే ఈ దాడి సున్నీ నివాసితులపై ప్రతీకార దాడులకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story