CM Chandrababu: బెల్ట్ తీస్తాం.. తాట తీస్తాం : వాళ్లకు సీఎం మాస్ వార్నింగ్

by Rani Yarlagadda |
CM Chandrababu: బెల్ట్ తీస్తాం.. తాట తీస్తాం : వాళ్లకు సీఎం మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని, ఇందుకోసం ఇప్పటికే రూ.890 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). 8వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో.. 150 రోజుల పాలనపై మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం అవేనన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే.. ఊరుకోబోమని, తాటతీస్తాం ఖబడ్దార్ అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. కరడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదని, నేరస్తుల్ని శిక్షించడంలో ఎక్కడా రాజీపడమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం జీఓలను దాచిపెడితే.. తాము అన్ని జీఓలను ఆన్లైన్లో పెడుతున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో 22A కింద భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. భూ దోపిడీ జరగకుండా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (Anty Land Grabbing Act) తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మద్యం విషయంలోనూ గత ప్రభుత్వం అరాచకం చేసిందని, కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాల్ని బలితీసుకుందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొచ్చామని, ఎవరైనా బెల్ట్ షాపు పెడితే బెల్టు తీస్తామన్నారు. బెల్టు షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని (Polavaram) పూర్తి చేస్తామని, ఆ ప్రాజెక్ట్ ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed