Breaking News: విజయవాడలో వరద బీభత్సం.. బోటులో స్పాట్‌కు సీఎం

by srinivas |   ( Updated:2024-09-01 12:39:41.0  )
Breaking News: విజయవాడలో వరద బీభత్సం.. బోటులో స్పాట్‌కు సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కుంభవృష్టిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బుడమేర వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. బస్తీలు, కాలనీలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. సింగ్ నగర్, చిట్టీనగర్ ప్రాంతాల్లో రోడ్లపై భుజం ఎత్తులో నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


దీంతో వరద పరిస్థితులపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముంపు వివరాలను మంత్రి నారాయణ, కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కనకదుర్గ వారధిపై నుంచి కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు భారీగా ఉండటంతో బోటులో వెళ్లారు. వరద బాధితులను పరామర్శించారు.


మరో 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం సూచించారు. విజయవాడలో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం బాధాకరమన్నారు. సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ రాత్రికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌లోనే ఉంటానని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed